Iran : ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తైంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి సంబంధించి ఇరాన్‌కు జరిగిన తీవ్ర నష్టాల్లో ఒకటి.. అక్కడి స్కూల్‌పై అమెరికా దాడి చేయడం. ఇరాన్, మినాబ్‌లోని షజారెహ్ తయ్యేబే అనే బాలికల పాఠశాలపై అమెరికా సైన్యం తోమహాక్ మిస్సైల్‌తో దాడి చేసింది. ఈ ఘటనలో 175 మంది మరణించారు. ఇందులో 168 మంది పిల్లలు ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
దీనిపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలపై దాడి చేయడం సరికాదని పేర్కొంది. ఈ దాడికి ప్రధాన కారకులైన అమెరికన్ నేవీ అధికారుల వివరాల్ని ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఇండియాతోపాటు నైజీరియా, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాయాలు వారి ఫొటోలు, వివరాల్ని వెల్లడించాయి. లేగ్ ఆర్ టేట్ అనే కమాండర్ ఆఫీసర్‌తోపాటు జెఫ్రీ ఈ యార్క్ అనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది. వీరు అమెరికన్ నేవీకి చెందిన వారని ఇరాన్ తెలిపింది. ఈ ఇద్దరినీ క్రిమినల్స్‌గా పేర్కొంది. వీరిని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఇద్దరే స్కూల్‌పై దాడి చేయాలని ఆదేశించారని, ఈ దాడిని ఆఫీసర్లు ఎలా సమర్ధించుకుంటారని ఇరాన్ ప్రశ్నించింది.
ఉద్దేశపూర్వకంగానే, లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగిందని జెనీవా డిబేట్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఆరోపించారు. మరోవైపు అమెరికా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అనుకోకుండా జరిగిన పొరపాటుగా దీన్ని అభివర్ణించింది. చాలాకాలం క్రితం అందిన సమాచారం ఆధారంగా ఈ లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. అయినప్పటికీ ఈ అంశంపై అమెరికా ఇంకా విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.