న్యూఢిల్లీ, జూన్ 20: ఇజ్రాయెల్‌లోని జనావాస ప్రాంతాలపై ఇరాన్ గురువారం క్లస్టర్ బాంబును మోసుకువెళ్లే క్షిపణిని పేల్చింది. 8 రోజులుగా సాగుతున్న యుద్ధంలో ఈ రకమైన బాంబును ఇరాన్ ఉపయోగించడం ఇదే మొదటిసారని ఇజ్రాయెలీ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లోని జనావాస ప్రాంతాలపైకి దూసుకువచ్చిన ఇరాన్ క్షిపణి డజన్ల కొద్దీ బాంబులను విరజిమ్మి భారీ విధ్వంసం సృష్టించింది. ఇరాన్ పేల్చిన క్షిపణి క్లస్టర్ బాంబుతో ప్రయాణించి భూ ఉపరితలానికి దాదాపు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి సుమారు 20 ఉప బాంబులుగా విడుదలై 8 కిలోమీటర్ల వ్యాసార్థంలో సెంట్రల్ ఇజ్రాయెల్‌పై దూసుకువచ్చాయని ఇజ్రాయెలీ మీడియా తెలిపింది.
ఇజ్రాయెల్‌లోని బీర్ షెవా నగరంలో మైక్రోసాఫ్ట్ ఆఫీసుతోసహా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న టెక్నో పార్కు సమీపంలో గురువారం పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడినట్లు సీఎన్ఎన్ తెలిపింది. అత్యవసర సర్వీసులు రంగంలోకి దిగాయని పేర్కొంది. అయితే ఇరాన్ క్షిపణిని తాము అడ్డుకుని పేల్చివేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దక్షిణ జిల్లాలోని అనేక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేసి విధ్వంసం సృష్టించాయని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు.
విస్తృత వ్యాసార్థంలో విధ్వంసం సృష్టించడం కోసం క్లస్టర్ బాంబును ప్రయోగిస్తారు. ఇది ఓ బాంబుల గుత్తి అని చెప్పవచ్చు. అనేక చిన్న బాంబులను ఇది విడుదల చేస్తుంది. ఒకేసారి పేలుడును సృష్టించకుండా ఈ బాంబు ఎక్కువ ఎత్తు ఉన్న ప్రదేశంలో గాలిలో విస్ఫోటం చెంది అనేక చిన్న బాంబులను విడుదల చేస్తూ విస్తృత వ్యాసార్థంలో లక్ష్యాలపై దాడి చేసి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. క్టస్లర్ బాంబుల ప్రయోగంపై వివాదాలు ఉన్నాయి. వీటిలో కొన్ని బాంబులు పేలకుండా అలాగే క్రియాశీలకంగా ఉండిపోయే అవకాశం ఉంది.
ఎవరైనా పొరపాటున వాటిని పట్టుకున్నా, సమీపానికి వెళ్లినా అవి పేలిపోయిన పక్షంలో ప్రాణ నష్టం సంభవిస్తుంది. జనావాసం ఉన్న ప్రాంతాలపై ఈ బాంబును ప్రయోగిస్తే అది సృష్టించే విధ్వంసం అపారమని ఆయుధాల నియంత్రణ సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డెరిల్ కిమ్బాల్ తెలిపారు. యుద్ధ సమయాలలో ప్రయోగించిన క్లస్టర్ బాంబులో కొన్ని చిన్న బాంబులు పేలకుండా అలాగే ఉండిపోయి తర్వాత కాలంలో విస్ఫోటం చెందే ప్రమాదం ఎక్కువని ఆయన చెప్పారు.