టెహ్రాన్, వాషింగ్టన్, ఏప్రిల్ 20: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండో విడత శాంతి చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకుని కూర్చున్న ఇరాన్ ఎట్టకేలకు మనసు మార్చుకుంది. ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేయడంతో ఇరాన్ అమెరికా నౌకలపై డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. పైగా అమెరికా మాట మీద నిలబడటం లేదని ఇరాన్ నాయకత్వం ఆక్షేపించింది. చివరకు మాత్రం చర్చలకు అంగీకరించింది. అమెరికాతో జరగబోయే శాంతి చర్చల్లో పాల్గొనడాన్ని సానుకూలంగా సమీక్షిస్తున్నామని తెలిపింది. అయితే దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయ్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. ‘ఇరాన్ మా కార్గో నౌకపై ఉదయం దాడి చేసింది. మా నౌకాశ్రయాలపై అమెరికా దిబ్బంధం ఇంకా కొనసాగిస్తూ అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణను కూడా ఆలస్యంగా అమలు చేస్తున్నది’ అని ఆరోపించారు. కాగా, మరోవైపు అమెరికా నుంచి ప్రతినిధుల బృందం రెండో విడత చర్చలకు వేదికైన పాక్‌కు బయలుదేరింది. చర్చలకు వచ్చేది రానిదీ ఇరాన్ ఇంకా చెప్పలేదని, అయితే తప్పక హాజరవుతుందన్న ఆశాభావంతో ఉన్నామని ఒక అధికారి తెలిపారు. మొదటి విడత చర్చల్లో కొన్ని అంశాల్లో ఇరువురి మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడిందని, అయితే ఈసారి చర్చలు ఫలవంతమవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
అయితే ఇరాన్ ఓడరేవులపై తాము విధించిన దిగ్బంధనాన్ని ధిక్కరించే ఏ నౌకనైనా స్వాధీనం చేసుకుంటామన్న తన హెచ్చరికను అమెరికా ఆదివారం అమలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌తో ఆ సంబంధం ఉన్న ఎం/వీ టౌస్కా నౌకపై ఉత్తర అరేబియా సముద్రంలో ఒక క్షిపణి విధ్వంసక నౌక కాల్పులు జరుపడం, ఆ తర్వాత ఆగిపోయిన నౌక డెక్‌పైకి హెలికాప్టర్ల నుండి తాడు సాయంతో సైనికులు దిగిన దృశ్యాలు ఉన్న వీడియో ఫుటేజ్‌ని అమెరికన్ సైన్యం విడుల చేసింది. ఇస్లామాబాద్‌లో ఈ వారం ఇరాన్‌తో శాంతి చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని తాము ఆశిస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్నందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.
నౌక, దాని సిబ్బందికి ఇప్పుడు ఏమి జరుగుతుందనేది అది తీసుకున్న వెళుతున్న వస్తువులపై ఆధారపడి ఉంటుందని సీఎన్ఎన్ వార్తాసంస్థకు నిపుణులు తెలిపారు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ వైపు అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న కంటైనర్ షిప్ టౌస్కాను గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ఎస్ స్పూన్స్ ఆరు గంటల పాటు పదేపదే హెచ్చరించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) తెలిపింది. మరోవైపు తమ వాణిజ్య నౌకను అమెరికా దళాలు సీజ్ చేసినందుకు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉన్న అమెరికా యుద్ధ నౌకలపై ఆదివారం డ్రోన్లతో దాడులు జరిపిందని ఇరాన్‌కు చెందిన తస్నీమ్ న్యూస్ వెల్లడించింది. అయితే ఇరాన్ జరిపిన డ్రోన్ల దాడిలో అమెరికా యుద్ధ నౌకలకు ఏదైనా నష్టం జరిగిందీ లేనిదీ తెలియ రాలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సముద్రపు దొంగతనానికి పాల్పడి తమ నౌకను స్వాధీనం చేసుకున్న యూఎస్ మిలిటరీపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ మిలిటరీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
మేం చెప్పిన తర్వాతే హొర్ముజ్లోకి వెళ్లండి.. భారత నేవీ
హొర్ముజ్ జలసంధి వద్ద భారత్‌కు చెందిన రెండు నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపిన క్రమంలో, భారత పతాక నౌకలకు మన నౌకాదళం అడ్వైజరీ జారీ చేసింది. వాణిజ్య నౌకలు జలసంధికి దగ్గరలో ఉన్న లారక్ ఐలాండ్‌కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతనే హొర్ముజ్‌లో ప్రయాణించాలని కోరింది. ఈ జల సంధి దాటేందుకు వేచి ఉన్న నౌకల భద్రతను నిర్ధారించేందుకే ఈ సూచనలు చేస్తున్నట్టు తెలిపింది.
ఇరాన్‌కు బాంబులు సరఫరా..యూఎస్ మహిళా వ్యాపారి అరెస్ట్
పశ్చిమాసియా యుద్ధం జోరుగా జరుగుతున్న వేళ ఇరాన్‌కు బాంబులు, డ్రోన్లు సరఫరా చేస్తున్న ఒక మహిళా వ్యాపారవేత్తను అమెరికాలో అరెస్ట్ చేశారు. ఇరాన్‌కు అవసరమైన యుద్ధ సామగ్రిని సరఫరా చేయడంలో వ్యాపారవేత్త షమీమ్ మాఫి మధ్యవర్తిత్వం వహిస్తున్నది. దీంతో శనివారం రాత్రి ఆమెను లాస్ఏంజెల్స్ విమానాశ్రయంలో అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. ఇరాన్ మూలాలున్న 44 ఏండ్ల షమీమ్ మాఫి అమెరికాలో స్థిరపడింది. యుద్ధ సామగ్రిని అక్రమంగా సరఫరా చేసేందుకు ఇరాన్ ప్రభుత్వంతో ఆమె ఒప్పందాలు కుదుర్చుకుని ఆర్మీ సిబ్బంది ఉపయోగించే డ్రోన్లు, బాంబులు, మందుగుండు సామగ్రిని అక్రమంగా తరలిస్తున్నది. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించింది.