టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఉత్తర ఇరాన్‌లోని ఐకానిక్ కారజ్ బ్రిడ్జిని కూల్చివేయడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతీకారంగా దెబ్బకు దెబ్బ తీస్తామని ప్రకటించింది. ఈ సందర్భంగా పశ్చిమాసియాలోని 8 ప్రధాన వంతెనలు లక్ష్యంగా దాడి చేస్తామని శుక్రవారం ప్రకటించిన ఇరాన్ .. దాని జాబితాను విడుదల చేసింది. సమీప దేశాల్లోని ప్రధాన వంతెనలను లక్ష్యంగా చేసుకుంటానని ఇరాన్ ప్రకటించిందని పాక్షిక అధికారిక ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ జాబితాలో కువైట్, బహ్రెయిన్లలో ఒక్కొక్కటి, యూఏఈలో రెండు, జోర్డాన్‌లో మూడు వంతెనలు ఉన్నాయి
పశ్చిమాసియా యుద్ధంలో తమ దాడులను ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ ప్లాంట్లకు కూడా విస్తరింప చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ అదే స్థాయిలో స్పందించింది. అదే కనుక జరిగితే పశ్చిమాసియాలోని అమెరికా-ఇజ్రాయెల్ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇరాన్‌కు చెందిన ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ అధికారిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాఘరి మాట్లాడుతూ ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై యూఎస్-ఇజ్రాయెల్ దాడులు చేస్తే పశ్చిమాసియాలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన చమురు, విద్యుత్తు, ఆర్థిక సంస్థలు సహా అన్నింటినీ ఇరాన్ మిలిటరీ దళాలు ధ్వంసం చేస్తాయని తెలిపారు.
ఈ ప్రాంతంలోని, ఆక్రమిత భూభాగాల్లోని ఆస్తులపై మాత్రమే కాకుండా అమెరికా మిత్రదేశాలు, ఆతిథ్య దేశాల కీలక ఆస్తులపై కూడా దాడులు చేస్తామని, ఈ దాడులు గతంలో ఎన్నడూ లేనంత వినాశకరంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. తమకు నష్టం కలగకుండా ఉండాలనుకుంటే అమెరికా మిలిటరీ బేస్‌లకు ఆశ్రయాలిచ్చిన దేశాలు యూఎస్ దళాలు వెంటనే తమ దేశం విడిచిపెట్టేలా అగ్రరాజ్యంపై ఒత్తడి తేవాలని ఆయన అన్నారు. కాగా, తమ దాడులతో ఇరాన్‌ను రాతియుగం కాలం నాటికి పంపేస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇస్లామిక్ రిపబ్లిక్ గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ అలీ జహన్‌షాహి స్పందిస్తూ తమ గడ్డపై అడుగుపెట్టిన అమెరికా సైనికులను రాతి యుగానికి కాదు.. రాతియుగానికి పూర్వపు కాలానికి పంపుతామని హెచ్చరించారు.
బహ్రెయిన్‌లోని అమెజాన్ కేంద్రంపై దాడి చేసిన ఒక రోజు తర్వాత ఇరాన్ శుక్రవారం మరో హెచ్చరిక చేసింది. ఈ ప్రాంతంలోని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) కంపెనీలు తమ లక్ష్యంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నది. వీడియో సందేశంలో ఇరాన్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ తమ పవర్ ప్లాంట్లపై అమెరికా దాడి చేస్తే అన్ని విద్యుత్, ఎనర్జీ మౌలిక సదుపాయాలతో పాటు జియోనిస్ట్ పాలనలోని ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీలపై దాడులు చేస్తామని తెలిపారు.
అలాగే అమెరికా షేర్ హోల్డర్స్‌తో ఉన్న కంపెనీలను కూడా నాశనం చేస్తామని తెలిపారు. గూగుల్ దాచి వేసినా.. తమ దృష్టి నుంచి ఏ కంపెనీ తప్పించుకోలేదని యూఏఈలోని స్టార్గేట్ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కంపెనీలు ఎన్వీడియా, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాక్స్ కంపెనీల సీఈవోల చిత్రాలను వీడియోలో ప్రదర్శించారు. కాగా, తాజా హెచ్చరికతో ఇరాన్.. పశ్చిమాసియాలోని మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, మెటాలను లక్ష్యంగా చేసుకోవచ్చునని భావిస్తున్నారు.