Iran Currency | టెహ్రాన్, డిసెంబర్ 18: చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ పతనమైంది. రికార్డు స్థాయిలో జీవన కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ప్రారంభమైన పతనం కొనసాగుతూ వస్తున్నది. అప్పటివరకు డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 7,77,000 రియాల్స్ ఉండగా, ట్రంప్ ఎన్నికైన తర్వాత 10 శాతానికి పైగా దిగజారి ఇప్పుడు 703,000 రియాల్స్‌గా ట్రేడవుతున్నది. అయితే దీనిని అరికట్టడానికి గతంలో ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ పెద్దమొత్తంలో మరిన్ని కరెన్సీలను మార్కెట్లోకి విడుదల చేసినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు.
కాగా ఇరాన్ చేపట్టిన ముమ్మర అణు కార్యక్రమాల కారణంగా ఆ దేశంపై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడంతో అర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో కునారిల్లుతున్నది. దానికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇజ్రాయెల్‌తో యుద్ధం, హమాస్, హెజ్బొల్లాకు ఇరాన్ సహకారం వంటి అంశాలు కూడా ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మేలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పెజెష్కియన్ తమపై ఉన్న ఆంక్షల సడలింపునకు కృషి చేస్తానని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు.