టెహ్రాన్: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఓవైపు సీజ్ఫైర్ కొనసాగుతుండగానే దాడులు జరుగుతున్నాయి. తాజాగా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడిచేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే అమెరికాతో శాంతి ఒప్పంద చర్చలు ఆపేసినట్టు టానిమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని.. అయితే ఒప్పందాన్ని బ్రేక్ చేసి దాడులు చేశారని ఆరోపించింది. అలాగే హొర్ముజ్‌ను పూర్తిగా మూసేయడానికి టెహ్రాన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. హొర్ముజ్‌తోపాటు బాబ్ అల్ మండెబ్ జలసంధిని కూడా మూసివేసేందుకు ఇరాన్, రెసిస్టెన్స్ ఫ్రంట్ సిద్ధమైనట్టు ఇరాన్ మీడియా తెలిపింది.
దక్షిణ లెబనాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ ఆదేశించడంతో తాజా ప్రతిష్ఠంభన ఏర్పడింది. లెబనాన్ మీద దాడుల తర్వాత ట్రంప్‌నకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చి వార్నింగ్ ఇచ్చారు. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ దాన్ని మర్చిపోయి దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అబ్బాస్ వెల్లడించారు. దీనికి యూఎస్, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలన్నారు. ఇంకోవైపు ట్రంప్ మాత్రం చర్చలు బాగా జరుగుతున్నాయని, మంచి ముగింపు వస్తుందంటూ వరుస పోస్టులు పెడుతున్నారు. దీంతో పశ్చిమాసియా లో యుద్ధం ముగుస్తుందా కొనసాగుతుందా అనే టెన్షన్ ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది.
ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం
వారాంతంలో అమెరికన్ డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిన నేపథ్యంలో ఇందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్‌లోని రాడార్, డ్రోన్ కేంద్రాలపై బాంబు దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ శని, ఆదివారాల్లో ఇరాన్‌లోని గేరుక్ నగరం చుట్టూ, ఖైష్మ దీవిపై దాడులు జరిపింది. అంతర్జాతీయ జలాలపై కార్యకలాపాలు సాగిస్తున్న యూఎస్ ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేయడంతో ఇరాన్ దుందుడుకు చర్యలకు సమాధానంగా దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని అమెరికా బేస్లే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది.