వాషింగ్టన్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం ఇరాన్(Iran)లో పర్యటిస్తున్నారు. టెహ్రాన్‌లో ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచితో భేటీ అయ్యారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తలను తగ్గించే నేపథ్యంలో అసిమ్ మునీర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే యుద్ధం విషయంలో ఇరాన్, అమెరికా మధ్య కొన్ని అంశాల్లో అగ్రిమెంట్ కుదిరింది. రెండు వారాల సీజ్ఫైర్ నేపథ్యంలో ఇంకా కొన్ని తేలని అంశాలు ఉన్నాయి. ఇరాన్ చేపట్టే అణ్వస్త్ర కార్యక్రమాల గురించి రెండు దేశాల మధ్య ఒడంబడిక కుదరలేదని ఓ సీనియర్ ఇరానీ అధికారి తెలిపారు. అసిమ్ మునీర్ రాక వల్ల అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత తగ్గినట్లు ఓ అధికారి చెప్పారు.
కొన్ని అంశాల్లో అంగీకారం కుదిరిందని, అయితే టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య చర్చల వల్ల సీజ్‌ఫైర్‌ను మరింత పొడిగిస్తారన్న భావన వస్తోందని ఆ అధికారి తెలిపారు. కేవలం అణ్వస్త్ర రంగం అంశంలో మాత్రం అమెరికా,ఇరాన్ మధ్య బేధాభిప్రాయాలు వస్తున్నట్లు వెల్లడించారు. శుద్దీకరించిన యురేనియంతో పాటు న్యూక్లియర్ ఆంక్షల అంశంలో ఇంకా అంగీకారం కుదరలేదని తెలుస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య జరిగే రెండో దఫా చర్చలపై ఇంకా తేదీలను నిర్ణయించలేదని పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం ఆ దేశాలు న్యూక్లియర్ అంశాలపై చర్చిస్తున్నాయన్నారు.