సురిన్: థాయ్‌ల్యాండ్, కంబోడియా సరిహద్దు వద్ద ఉన్న తా మోన్ థోమ్, తా క్రబే ఆలయాల(Cambodia Temples) వద్ద భీకర పోరాటం జరుగుతోంది. ఆ ఆలయాల వద్ద ఇవాళ సాయంత్రం మళ్లీ ఘర్షణలు తలెత్తాయి. రెండు దేశాలకు చెందిన సైనిక బలగాలు సత్తా చాటుతున్నాయి. ఈ రెండు ఆలయాలను స్వాధీనం చేసుకోవాలని థాయ్ ఆర్మీ ప్రయత్నిస్తోందని, ఈ నేపథ్యంలో భారీగా ఫైరింగ్‌కు పాల్పడినట్లు కంబోడియా ఆరోపిస్తున్నది. సాయంత్రం ఆరు గంటల తర్వాత థాయ్ మిలిటరీ దూకుడు పెంచినట్లు కంబోడియా పేర్కొన్నది. రెండు ప్రాచీన ఆలయాలను ఆ దేశం టార్గెట్ చేసినట్లు చెప్పింది. మందుగుండు సామాగ్రితో పాటు సైనిక బలగాలు ఆ ఆలయ ప్రాంతాలను చుట్టుముట్టినట్లు కంబోడియా తెలిపింది. అయితే థాయ్ బలగాలకు గట్టిగా బదులు ఇస్తున్నామని కూడా కంబోడియా పేర్కొన్నది. బలమైన రీతిలో ప్రతిదాడికి పాల్పడుతున్నామని చెప్పింది. భీకర పోరు నేపథ్యంలో భారీ స్థాయిలో ఫైరింగ్ నమోదు అయ్యింది. ప్రిహే వియార్ ప్రావిన్సులోని పలు ప్రాంతాల్లోనూ షెల్లింగ్ కొనసాగుతోంది.