Heart Attack | మెల్బోర్న్, మార్చి 3: నిద్రలేమితో గుండెజబ్బుల ముప్పు పెరిగే ప్రమాదం ఉన్నదని, ముందస్తు మరణం కూడా సంభవించవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బ్రిటన్ బయోబ్యాంక్లోని మూడు లక్షల మంది మధ్య వయస్సు వారిపై ఈ అధ్యయనం జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు బీఎంసీ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
సరిపడినంత నిద్రపోకపోవడం, నిద్రలేమి, గురక, ఆలస్యంగా పడుకోవడం, పగటివేళ నిద్ర రావడం వంటి సమస్యలు ఉన్న వారిలో గుండె ఆరోగ్యం రెండేండ్లు తగ్గుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులోనూ ఆడవారి కంటే మగవారిలోనే కొంచెం నష్టం ఎక్కువగా ఉంటున్నదని తేల్చారు. స్లీప్ ఆప్నియా వంటి నిద్ర సంబంధిత శ్వాస రుగ్మతలు ఉన్న వారిలో గుండె ఆరోగ్యం దాదాపు ఏడేండ్లు తగ్గుతున్నదని తెలిపారు.