తమ దేశంలోని డుకొనొ అగ్ని పర్వతం పేలి ముగ్గురు మృతి చెందారని.. 10 మంది గల్లంతయ్యారని ఇండోనేషియా అధికారులు శుక్రవారం తెలిపారు. అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిద 10 కిలో మీటర్ల ఎత్తు వరకు ఎగసిందని వారు చెప్పారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారని నార్త్ హల్మహెరా పోలీస్ చీఫ్ సపరిబు తెలిపారు.
ఈ ఘటనలో ఐదుగురు పర్వతారోహకులు గాయపడ్డారని విపత్తు నిర్వహణ ఏజెన్సీ తెలిపింది. కఠిన భౌగోళిక పరిస్థితులు, విస్ఫోటం కొనసాగడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయని వెల్లడించింది. అగ్ని పర్వత విస్ఫోటం గురించి ముందుగానే తాము హెచ్చరించామని.. అయితే విదేశీయులకు ఈ విషయం తెలియకపోవచ్చని దేశ భూగర్భ శాస్త్ర ఏజెన్సీ తెలిపింది.