Firing @ Iran | ఇరాన్లో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారి, మహిళ, పోలీసు ఉన్నారు. ఇరాన్‌కు చెందిన ఐఆర్ఎన్ఏ వార్తా ఛానెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కాల్పుల ఘటన నైరుతి ఇరాన్‌లోని ఇజే సిటీలో జరిగింది. కాల్పులకు ఇంతవరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
ఇజే నగరంలోని మార్కెట్లో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సెంట్రల్ మార్కెట్లో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉంటారు. సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తున్నది. తొలుత అక్కడి జనితేవార్, ఓ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో మొత్తం ఐదుగురు చనిపోయారు. మరో 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒక చిన్నారి, మహిళ, పోలీసు ఉన్నారు.
దాడికి గల కారణాలు తెలియరాలేదని స్థానిక పోలీసు అధికారి చెప్పారు. రెండు నెలలుగా జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక నిరసనలకు సంబంధించి ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల అనంతరం అక్కడ గుమిగూడిన ప్రజలు ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ప్రజలను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.
గత నెల 26 నాటి రోసి షిరాజ్ నగరంలో కాల్పులను మరిచిపోకముందే ఇజే నగరంలో కాల్పులు జరుగడం ఇక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. రోసి షిరాజ్ నగరంలో అలికాడ్ సమయంలో జరిగిన ప్రదర్శనల నేపథ్యంలో చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ దాడిలో 15 మంది మరణించారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు షియా కమ్యూనిటీని టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానించారు.