Sweden | స్టాక్‌హోమ్ : ఐరోపాలో స్థిరపడాలనుకునే భారతీయులకు ఆకర్షణీయంగా కనిపించే స్వీడన్ దేశం పట్ల క్రమంగా ఆసక్తి తగ్గిపోతున్నది. వీలైతే స్వీడన్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రవాస భారతీయులు ప్రయత్నిస్తున్నారు. ‘స్టాటిస్టిక్స్ స్వీడన్’ లెక్కలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ వివరాల ప్రకారం.. 2024 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో స్వీడన్‌కు వచ్చిన భారతీయుల కంటే, ఈ దేశాన్ని వీడిన భారతీయుల సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఈ ఆరు నెలల కాలంలో 2,837 మంది భారత్‌లో జన్మించిన వారు స్వీడన్‌ను విడిచిపెట్టి వెళ్లారు. గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఇది 171% ఎక్కువ.
భారతీయులు స్వీడన్‌ను విడిచిపెట్టడానికి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, అందుబాటు ధరల్లో ఇండ్లు లభించకపోవడం వంటివే ప్రధాన కారణాలు. పైగా ఇటీవల స్వీడన్‌కు చెందిన పలు కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటించాయి. ఆ తర్వాత కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కష్టంగా మారడంతో కొందరు స్వీడన్‌ను వీడుతున్నట్టు తెలుస్తున్నది. ఇక, వర్క్ పర్మిట్ల విషయంలో ఇటీవల స్వీడన్ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడం, జీవిత భాగస్వాములకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారడం కూడా చాలామంది దేశం వీడటానికి కారణాలు.