న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన గోల్డ్ కార్డ్ పట్ల భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజాదరణ పొందిన నాన్ ఇమిగ్రెంట్ హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం భారతీయ ప్రతిభావంతులు చూస్తున్నారు. అమెరికా రెసిడెన్సీ పొందడానికి సత్వర మార్గమనే హామీని గోల్డ్ కార్డ్ ఇస్తుండటంతో భారతీయుల నుంచి విచారణలు 30-40 శాతం మేరకు పెరిగాయి. వీరిలో సంపన్నులు ఎక్కువగా ఉన్నారు. గోల్డ్ కార్డ్ జారీ కోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ ఈ నెల 19న సంతకం చేశారు. 1 మిలియన్ డాలర్లు చెల్లించి ఈ కార్డును కొనుక్కోవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం గల మిడ్ కెరీర్ టెక్ ప్రొఫెషనల్స్ గోల్డ్ కార్డ్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
వ్యక్తిగతంగా 1 మిలియన్ డాలర్లు లేదా కార్పొరేట్ స్పాన్సర్షిప్ ద్వారా 2 మిలియన్ డాలర్లు అమెరికా ఖజానాకు ‘బహుమతి’ గా ఇచ్చేవారికి గోల్డ్ కార్డు వస్తుంది. ఈ సొమ్మును తిరిగి చెల్లించరు. ఇది ఈబీ5 మాదిరిగా పెట్టుబడి ఆధారిత వీసా కాదు. ఈ సొమ్మును అమెరికన్ వాణిజ్య, పరిశ్రమలకు ఇచ్చే కంట్రిబ్యూషన్‌గా పరిగణిస్తారు. ఇప్పటికే 2.5 లక్షల మంది ఆసక్తి చూపుతున్నారని అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ చెప్పారని సింఘానియా అండ్ కో మేనేజింగ్ పార్టనర్ రోహిత్ జైన్ తెలిపారు. ఇదిలావుండగా, ఎపోనిమస్ లా ఫర్మ్‌ను నడుపుతున్న ప్రాచీ షా మాట్లాడుతూ, గోల్డ్ కార్డ్ పట్ల దక్షిణాసియా క్లయింట్లలో ఆసక్తి తక్కువగా ఉందన్నారు. దీనికి కారణం నాన్ రిఫండబుల్ 1 మిలియన్ డాలర్లు చెల్లించాలనే నిబంధనేనని చెప్పారు. ఇమిగ్రేషన్ లాయర్లు స్పందిస్తూ, కొందరు భారతీయులు ఇతర దేశాలవైపు చూస్తున్నారన్నారు. ట్రంప్ మరోవైపు ప్లాటినం కార్డును తేవడానికి చూస్తున్నారు. ఈ కార్డు, రెసిడెన్సీ పర్మిట్ కోసం 5 మిలియన్ డాలర్లు కంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుందని చెప్తున్నారు.
వాషింగ్టన్: అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ భారత్‌ను సరి చేయాల్సి ఉందని ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ మరోసారి హెచ్చరించారు. తమ దేశ వినియోగదారులకు భారత్ ఏమైనా అమ్మాలనుకుంటే తమ అధ్యక్షుడితో చర్చలు జరపాలన్నారు. భారత్, బ్రెజిల్‌ను విమర్శిస్తూ అవి తమ మార్కెట్లను తెరవడానికి చాలా చేయాల్సి ఉందని.. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించే చర్యలను అవి మానుకోవాలని..అన్నారు. పలు వాణిజ్య సంప్రదింపులు పరిష్కారం కావాల్సి ఉందని, వాటిలో భారత్, బ్రెజిల్ ఒప్పందాలు పెద్దవన్నారు.
న్యూఢిల్లీ: ‘అమెరికన్ వ్యవస్థ అనేక దశాబ్దాలుగా విదేశీ వర్కర్లను దోచుకుంటున్నది. ఐటీ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తాయి. వారి చేత మితిమీరిన పని చేయించుకుంటాయి. చెప్పిన పని చేయకపోతే, తమను అమెరికా నుంచి పంపించేస్తారనే భయంతో భారతీయులు పని చేస్తారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ చీకటి కోణం ఇది’ అని ఏంజెల్ ఇన్వెస్టర్ జేసన్ కలకనిస్ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. “1990వ దశకం ప్రారంభంలో నేను ప్రత్యక్షంగా చూశాను.
ఐటీ కంపెనీలు భారతీయులను నియమించుకుంటాయి. వీళ్లు సగం జీతానికే పని చేస్తారని కంపెనీల మేనేజ్మెంట్లు చెప్పుకుంటాయి. పని చేయబోమని ఇండియన్లు చెప్పలేరని, అది చాలా మంచి విషయమని చెబుతారు. వీకెండ్ కవరేజ్‌లో వాళ్లని పెట్టినా పని చెయ్యలేమని ఎందుకు చెప్పరంటే, మనం వాళ్లని దేశం నుంచి తగిలేస్తాం, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి వాళ్లకి 30 రోజులే ఉంటుంది” అని అమెరికన్ ఐటీ కంపెనీలు చెబుతాయని జేసన్ తెలిపారు.