Dubai : దుబాయ్‌లో సోమవారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఒక మినీ బస్సు, ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు భారతీయులు మరణించారు. ఈ విషయాన్ని దుబాయ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. దుబాయ్‌లోని ఎమిరేట్ రోడ్డుపై సోమవారం ఒక ట్రక్కు వెళ్తుండగా, సాంకేతిక సమస్య కారణంగా ఉన్నట్లుండి ఆగిపోయింది.
ఇదే సమయంలో వెనుకనుంచి వస్తున్న ఒక మినీ బస్సు ఆగిపోయిన ట్రక్కును ఢీకొంది. అయితే, ట్రక్కుకు కనీసం దూరం పాటిస్తే ప్రమాద తీవ్రత తప్పేదని దుబాయ్ ట్రాఫిక్ పోలీస్ డీజీ బ్రిగేడియర్ జుమా సలేమ్ బిన్ సువైదాన్ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు భారతీయ కార్మికులు మరణించారు. మరో 9 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలుకాగా, నలుగురికి సాధారణ గాయాలయ్యాయి. ఈ బస్సు ప్రమాదంతో ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్తలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై భారత రాయాబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. బస్సు ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్రంగా కలత చెందామని, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని అధికారులు అన్నారు. బాధితులకు సాయం చేసేందుకు దుబాయ్ అధికారులతో కలిసి పని చేస్తున్నామని, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.