న్యూఢిల్లీ: అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం నుంచి మరో ఎదురుదెబ్బ తగలనున్నది. అమెరికాలో ఉద్యోగ అనుభవాన్ని కోరుకునే అంతర్జాతీయ విద్యార్థులకు జీవనాడి లాంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) ప్రోగ్రామ్ని పూర్తిగా రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు కొత్త పన్ను ప్రతిపాదనలు, మోసపూరిత చర్యలపై కఠిన చర్యలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024లో దాదాపు 2 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఓపీటీ ప్రోగ్రామ్ ద్వారా, మరో 95,000 మంది స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) ఎక్స్టెన్షన్ ద్వారా ఉద్యోగ అనుభవాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇక భవిష్యత్తులో ఆ అవకాశం ఉండకపోవచ్చు.
అమెరికన్ వర్కర్లను దెబ్బతీస్తున్న ఓపీటీ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అధ్యక్షుడు ట్రంప్ కింద పనిచేసే విధానకర్తలు వాదిస్తున్నారు. ఓపీటీ వంటి వీసా క్యాటగిరీలను తగ్గించడం లేదా పూర్తిగా నిర్మూలించడం చేయాలని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్‌లో పాలసీ స్టడీస్ డైరెక్టర్ జెస్సికా వాఘన్ అమెరికన్ పార్లమెంట్‌ని కోరారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టం స్ఫూర్తిని ప్రస్తుత విధానం ఉల్లంఘిస్తోందని, ఎఫ్-1 విద్యార్థులకు చదువు తర్వాత పనిచేసే అధికారాన్ని కల్పించరాదని అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అధిపతిగా బాధ్యతలు చేపట్టనున్న జోసెఫ్ ఎడ్లో గతంలో ప్రకటించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఓపీసీ ప్రోగ్రామ్ని రద్దు చేసేందుకు చర్యలు వేగవంతం చేసే అవకాశం ఉంది.
ఓపీటీ కింద పనిచేసే కాలంలో జీతంపై అందచేస్తున్న పన్ను మినహాయింపులను రద్దు చేయాలని కొందరు పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ ప్రతిపాదన చట్టరూపం దాలిస్తే విద్యార్థులపై పెను ఆర్థిక భారం పడనున్నది. వారికి లభించే వేతనంలో అధిక భాగం పన్ను రూపంలో కోతకు గురవుతుంది. ఓపీటీని రద్దు చేయడంతోనే ట్రంప్ సర్కార్ సరిపెట్టుకునే అవకాశం లేదు. స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్(సెవీస్) సిస్టమ్‌లో ఉపాధి రికార్డులను 90 రోజుల్లో అప్డేట్ చేయని విద్యార్థులపై డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు ఐసీఈ హెచ్చరించింది. తమ వీసా హోదాను కోల్పోకుండా వెంటనే తమ రికార్డులను అప్డేట్ చేసుకోవాలని ఎస్ఈవీపీ విద్యార్థులకు సూచించింది.
ఇదిలా ఉంటే, ఉద్యోగం చేయనప్పటికీ ఓపీటీ విద్యార్థులను ఉద్యోగం చేస్తున్నట్లు నకిలీ పే స్లిప్పులు జారీచేస్తున్న కంపెనీల యాజమాన్యాలపై అమెరికా అధికారులు ఇప్పుడు కన్నేశారు. అటువంటి చర్యలు చట్ట విరుద్ధమని, పట్టుబడినవారి వీసాలు రద్దు చేయడంతోపాటు అమెరికాలో విద్యార్థులు చట్టబద్ధంగా నివసించేందుకు అవసరమైన 1-20 ఫారాన్ని కూడా రద్దు చేస్తామని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ప్రతిపాదిత ఓపీటీ ప్రక్షాళన వల్ల అమెరికా ఉద్యోగ జీవితంపై ఆశలు పెట్టుకున్న వేలాది భారతీయ విద్యార్థుల భవితవ్యంపై ట్రంప్ కత్తి వేలాడుతోంది.
వాషింగ్టన్: మద్యం సేవించి వాహనాన్ని నడపటం అమెరికా నుంచి బహిష్కరించదగిన నేరం కాబోతున్నది. ఈ నేరం పదేళ్ల క్రితం జరిగినా దేశ బహిష్కరణ తప్పదు. దీనికి సంబంధించిన ‘ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డీయూఐస్ యాక్ట్ (డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్) బిల్లును వైట్ హౌస్ పూర్తిగా సమర్థిస్తున్నది. దీనిని ప్రస్తుతం సెనేట్ సమీక్షిస్తున్నది. ఈ బిల్లుకు ఆమోదం లభించి, చట్టంగా మారితే, అమెరికా పౌరులు కానివారు ఈ నేరం చేసినట్లు రుజువైతే, ఆ నేరం ఎప్పుడు జరిగిందనే దానితో సంబంధం లేకుండా దేశం నుంచి బహిష్కరించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తున్నది. అదే విధంగా అమెరికాలో ప్రవేశానికి అనుమతిని నిరాకరించేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వలసదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.