బారి(ఇటలీ): టెక్నాలజీలో గుత్తాధిపత్యానికి స్వస్తి పలకాలని భారత ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సమ్మిళిత సమాజానికి పునాది వేసేందుకు సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఇటలీలోని అపులియా రీజియన్లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రత్యేకంగా మాట్లాడారు. మనం సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకోవాలే తప్ప విధ్వంసకరంగా కాదని అభిప్రాయపడ్డారు.
మానవ కేంద్రీకృత విధానం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు భారత్ ప్రయత్నిస్తున్నదని మోదీ పేర్కొన్నారు. భారత్ ఏఐ మిషన్ ప్రాథమిక మంత్రం ‘అందరికీ ఏఐ’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత, ఉద్రిక్తతల ప్రభావాన్ని దక్షిణ దేశాలు అధికంగా ఎదుర్కొంటున్నాయన్నారు. జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ, ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, పోప్ ఫ్రాన్సిస్లతో సమావేశమయ్యారు.