Indian origin MP| సింగపూర్: సహచర ఎంపీతో వివాహేతర సంబంధం బయటపడటంతో భారత సంతతికి చెందిన సింగపూర్ ఎంపీ లియోన్ పెరేరా తన పదవికి రాజీనామా చేశారు. సింగపూర్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన వర్కర్స్ పార్టీకి చెందిన లియోన్.. సహచర ఎంపీ నికోల్ సియాతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు 2021లోనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవి నిరాధారణమని వారు అప్పుడు కొట్టవేశారు. తాజాగా వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో రెండు రోజుల కిందట బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇరువురూ తమ పదవులకు రాజీనామా చేసినట్టు వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్, ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
వివాహేతర సంబంధం కారణంగా పార్లమెంట్ స్పీకర్ టాన్ చువాన్, జిన్, సహచర పీపుల్స్ యాక్షన్ పార్టీ ఎంపీ చెంగ్ లి హుయ్ తమ పదవులకు రాజీనామా చేసిన రెండు రోజులకే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ స్కాండల్స్ సింగపూర్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పెరెరా, సియా ఇద్దరూ వివాహితులే. ‘2020 సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు, చాలా కాలం కిందటే దానికి ముగింపు పలికినట్టు ఇద్దరూ అంగీకరించారు. అయితే ఇంతకుముందు ఆరోపణలు వచ్చినప్పుడు వారు పార్టీకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది ఏమాత్రం సమ్మతం కాదు’ అని ప్రీతమ్ తెలిపారు. ఎంపీలు క్రమశిక్షణతో వ్యవహరించాలని స్పష్టంచేశారు.