Singapore | సింగపూర్‌లోని ఓ చర్చిలో ఉగ్రవాద బెదిరింపులు కలకలం సృష్టించాయి. బాంబు పెట్టామని బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. చివరకు అది ఫేక్ బెదిరింపు అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని భారత సంతతికి చెందిన కోకుల్‌నాథ్ మోహన్‌గా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేశారు.
సింగపూర్‌లోని అపర్ బుకిట్ టిమా ప్రాంతంలో ఉన్న సెయింట్ జోసెఫ్ చర్చికి స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 7.11 బాంబు బెదిరింపు వచ్చింది. అదే సమయంలో కార్డ్బోర్డ్ రోల్స్‌లో ఒక బాంబు కనిపించింది. రాళ్ల ముక్కలు నింపి, ఎరువు వైర్లు బయటకు కనిపించేలా అమర్చి.. నలుపు, పసుపు రంగు టేప్‌తో చూట్టిన మూడు వస్తువులను ఉంచాడు. ఐఈడీ బాంబులా కనిపించడంతో చర్చిలోని వారంతా తీవ్ర భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చర్చికి చేరుకున్న పోలీసులు.. డిస్పోజ్ చేసేందుకు ప్రయత్నించగా అది ఫేక్ బాంబు అని తేలింది. కాగా, ఈ బాంబు బెదిరింపుతో ఆదివారం జరగాల్సిన ప్రార్థనా కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేశారు.
ఇక ఈ నకిలీ బాంబుతో బెదిరింపులకు పాల్పడింది భారత సంతతికి చెందిన సింగపూర్ పౌరుడు కోకుల్‌నాథ్ మోహన్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేదని నిర్ధారించారు. కాగా, నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. మానసిక వైద్య పరీక్షల కోసం మూడు వారాల పాటు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో కోకుల్‌నాథ్ దోషిగా తేలితే గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష లేదా ఐదు లక్షల సింగపూర్ డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.