హరారే, అక్టోబర్ 2: జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత్‌కు చెందిన మైనింగ్ కింగ్ హర్పాల్ రాంధావా దుర్మరణం పాలయ్యారు. నైరుతి జింబాబ్వేలోని మషావాలో ఉన్న ఓ డైమండ్ మైనింగ్ వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో అతడి కుమారుడు సహా మొత్తం ఆరుగురు మృతిచెందారు. హరారే నుంచి మురోవాలోని డైమండ్ మైన్‌కు వెళ్తుండగా శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.
సాంకేతిక లోపం కారణంగా వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ విమానం కుప్పకూలిపోయింది. దీంతో హర్పాల్, అతడి కుమారుడు అమేర్ సహా ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాదంపై విచారణ జరుగుతున్నది. భారత్‌కు చెందిన హర్పాల్ రాంధావా రియో జిమ్ అనే మైనింగ్ కంపెనీకి అధిపతి. ఆయన కంపెనీ బంగారం, బొగ్గు, నికెల్, కాపర్ తదితర ఖనిజాలను వెలికితీస్తుంది. ప్రస్తుతం ఆయన జెమ్ గ్రూప్‌కి చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు.