బీరుట్, సెప్టెంబర్ 26: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నది. లెబనాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్‌కు (భూతల దాడులకు) ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్నది. 21 రోజుల కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు చేసిన ప్రతిపాదనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పూర్తిస్థాయిలో హెజ్బొల్లాపై దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో లెబనాన్ మరో గాజాలా మారనుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మొన్నటి వరకు గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని ఇప్పుడు లెబనాన్ వైపు మార్చింది. హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఆ దేశంపై గగనతల, రాకెట్ల దాడులతో విరుచుకుపడుతున్నది. సోమవారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 630 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. లెబనాన్ ఉత్తర, తూర్పు ప్రాంతాలపై ఇజ్రాయెల్ 75 లక్షిత దాడులు చేసింది. దీనికి ప్రతిగా లెబనాన్ చేసిన 45 దాడులను తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా ఇజ్రాయెల్ బుధవారం రాత్రి లెబనాన్‌లోని ఒక భవనంపై జరిపిన దాడిలో సిరియా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 23 మంది మరణించారని లెబనాన్ అధికారి తెలిపారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు పలు అగ్రరాజ్యాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. 21 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ యూఎస్, యూకే, ఈయూ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తోసిపుచ్చారు. హెజ్బొల్లాపై పూర్తిస్థాయిలో దాడి చేయాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రస్తుతం లెబనాన్‌పై దాడులు జరుపుతున్నప్పటికీ తమ యుద్ధ లక్ష్యం నెరవేరే వరకు గాజాపై కూడా దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాలని లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి కోరారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ గగన దాడులతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలతో జరుగుతున్న దాడుల వల్ల లెబనాన్ పౌరులలో భయం నెలకొందని అన్నారు
లెబనాన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ నివసిస్తున్న భారత పౌరులు దేశాన్ని విడిచివెళ్లాలని, అక్కడే ఉండాలనుకునే వారు జాగ్రత్తలు పాటించాలని బీరుట్‌లోని భారత ఎంబసీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఏదైనా అవసరమైతే బీరుట్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో లైవ్ టీవీ ఇంటర్వ్యూ జరుపుతున్న లెబనాన్ జర్నలిస్టు ఒకరు స్వల్పంగా గాయపడ్డారు. మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఎడిటర్-ఇన్-చీఫ్ ఫడీ బౌండ్య ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉండగా, ఇజ్రాయెల్ ప్రయోగించిన మిస్సైల్ ఒకటి అతని ఇంటిని తాకింది. దీంతో ఆయన బిగ్గరగా అరుస్తూ స్క్రీన్కు దూరంగా పడ్డారు.