US Warns India | ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు మద్దతునిస్తున్న భారత్‌పై అమెరికా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో సంబంధాలు క్లిష్టతరం అవుతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర పట్ల భారత్ స్పందన తమను నిరాశ పరిచిందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. రష్యా పట్ల భారత్, చైనా నిర్ణయాలతో తాము నిరాశకు గురయ్యామని వైట్‌హౌస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరెక్టర్ బ్రెయిన్ డీసీ వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెయిన్ డీసీ మీడియాతో మాట్లాడారు.
రష్యాతో స్పష్టమైన వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగితే భారత్.. సుదీర్ఘకాలం గణనీయ ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రెయిన్ డీసీ హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా మీద అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ పలు రకాల ఆర్థికపరమైన ఆంక్షలు విధించాయి. కానీ ఆ ఆంక్షలను అమలు చేయడానికి భారత్ నిరాకరించింది. దానికి మించి రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు సాగిస్తున్నది.
ఆసియా ఖండంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామిగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా పట్ల ప్రతిస్పందిస్తున్న భారత్ తీరుతో అమెరికా-భారత్ సంబంధాలు క్లిష్టతరం అవుతాయని బ్రెయిన్ డీసీ హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్‌సింగ్ గతవారం పర్యటించిన నేపథ్యంలో బ్రెయిన్ డీసీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.