ఢాకా, ఏప్రిల్ 19: బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. తాజాగా హిందూ వర్గానికి చెందిన ఒక నేతను కొందరు కిడ్నాప్ చేసి హత్య చేశారు. దీనజ్పూర్ జిల్లా బసుదేబ్పూర్లో నివసించే 59 ఏండ్ల శ్రీ భాబేష్ చంద్రరాయ్ ఇంట్లో ఉండగా గురువారం నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసి నరబరిపూర్ గ్రామానికి తీసుకెళ్లి దౌర్జన్యం చేశారు.
తర్వాత తీవ్ర గాయాలతో స్పృహ లేకుండా ఉన్న అతడిని ఇంటి వద్దకు తీసుకొచ్చి వదిలేశారు. వెంటనే అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. కాగా, హిందూ నేత హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది. మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించడంలో యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని మన విదేశాంగ శాఖ ఆరోపించింది.