Russian Oil | రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై (Russian Oil) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ (India) తాజాగా స్పందించింది. దేశ భద్రత, ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదుడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరా.. ఈ రెండే మా ఇంధన విధానంలోని ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం’ అని తెలిపారు.
ఇక అమెరికా విషయానికొస్తే.. చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని తెలిపారు. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
Also Read..
Donald Trump | మోదీ మాటిచ్చారు.. ఇకపై రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదు: డొనాల్డ్ ట్రంప్
India Passport | పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. దిగజారిన భారత్ స్థానం.. ఎంతంటే..?
Pak Afghan Clashes | దెబ్బకు పరార్.. పాక్ సైనికుల దుస్తులను బహిరంగంగా ప్రదర్శించిన తాలిబన్లు