న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు చోటు లేకపోవడం ‘అసంబద్ధం’ అని వ్యాఖ్యానించారు. యూఎన్ఎస్సీలో ఏ ఒక్క ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ‘ఎక్స్’లో ఆందోళన వ్యక్తం చేశారు.
సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించాలి తప్పితే 80 ఏళ్ల క్రితాన్ని కాదని పేర్కొన్నారు. గుటెరస్ పోస్టుకు అమెరికాకు చెందిన ఇజ్రాయెలీ పెట్టుబడిదారు మైఖేల్ ఐసెన్బెర్గ్ స్పందిస్తూ ‘మరి భారత్ సంగతేంటని?’ ప్రశ్నించారు. ఈ చర్చలో జోక్యం చేసుకున్న మస్క్ ఐరాస నిర్మాణం సరిగా లేదని, అత్యధిక జనాభా కలిగిన భారత్కు అందులో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ‘అసంబద్ధం’ అని పేర్కొన్నారు. దీనిని సంస్కరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు.