న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళం ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మిగ్-21 యుద్ధ విమానాలకు సెప్టెంబర్‌లో వీడ్కోలు పలకనున్నట్లు చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో రష్యన్ తయారీకి చెందిన అత్యాధునిక ఫిఫ్త్ జరేషన్ యుద్ధ విమానం సుఖోయ్-57(Su-57)పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఎయిర్ షోలో ఆ వార్ ప్లేన్‌ను ప్రదర్శించారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం.. ఇజ్రాయిల్, హమాస్ మధ్య వార్, ఇటీవల ఇండో పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో వైమానిక ఆయుధాలపై సమీక్ష నిర్వహించాల్సి వస్తున్నది. ప్రత్యర్థి దేశాల వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలకు దీటుగా తమ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే రష్యాకు చెందిన మిగ్-21కు గుడ్‌బై చెప్పి.. సుఖోయ్-57కు ఎక్కువ ప్రియార్టీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
వాస్తవానికి ఇండియా తన దేశీయ టెక్నాలజీతో ఫిఫ్త్ జనరేషన్ జెట్‌ను తయారు చేస్తున్నది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)ను డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్త్, మల్టీరోల్, సింగిల్ సీట్, ట్విన్ ఇంజిన్ సామర్థ్యంతో దీన్ని తయారు చేస్తున్నారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని డిజైన్ చేసింది. సుమారు రెండు బిలియన్ల డాలర్ల ఖర్చుతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. 2035లో ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏఎంసీఏ ఎంకే-1, ఏఎంసీఏ ఎంకే-2 దశల్లో ఏఎంసీఏ విమానాలను డెవలప్ చేయనున్నారు. ఎంకే2 ద్వారా ఎక్కువ శాతం స్టీల్త్, ఏఐ ఇంటర్ఫేస్ సామర్థ్యంపై ఫోకస్ చేయనున్నారు. సుఖోయ్-30 ఎంకే1 తరహాలో ఏఎంసీఏ విమానం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన ఎఫ్-35 తరహాలో .. రష్యన్ సుఖోయ్-57 ఉంటుదని నిపుణులు భావిస్తున్నారు. సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో సుఖోయ్-57ను వాడారు. దీనికి సంబంధించిన ప్రొడక్షన్, టెక్నాలజీ షేరింగ్ అంశాన్ని భారత్‌తో చర్చించినట్లు గతంలో రష్యా చెప్పింది. వాస్తవానికి గతంలో సుఖోయ్-57 అంశంలో ఓ ప్రాజెక్టుతో ఒప్పందం కుదుర్చుకున్నా.. మళ్లీ ఆ ప్రాజెక్టు నుంచి ఇండియా తప్పుకున్నది. సుఖోయ్-57లో ఎక్స్పోర్ట్ వేరియంట్ ఎస్‌యూ-57ఈని కూడా తయారు చేశారు. అనేక వైమానిక ప్రదర్శనల్లో ఆ వేరియంట్‌ను ప్రజెంట్ చేశారు. రష్యా ఇప్పటి వరకు 42 సుఖోయ్-57 యుద్ధ విమానాలను ఉత్పత్తి చేసింది. ఎఫ్-35తో పోలిస్తే దీని ధర తక్కువే.
భవిష్యత్తు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని సుఖోయ్-75 చెక్‌మేట్ విమానాలను కూడా రష్యా డెవలప్ చేస్తున్నది. అమెరికన్ ఎఫ్-35, చైనాకు చెందిన షెన్యాంగ్ జే-35 లాంటి వాటితో ఇది పోటీపడగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ సామర్థ్యంతో ఆ యుద్ధ విమానాన్ని తయారు చేశారు. ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం ఎఫ్-35 యుద్ధ విమానాలు వెనుకబడి ఉన్నాయని, ఈ నేపథ్యంలో సుఖోయ్-57పై ఇండియా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు.