బెలెం (బ్రెజిల్), నవంబర్ 19 : వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ పనితీరు గణనీయంగా తగ్గిందని బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరుగుతున్న కాప్ 30 సమావేశంలో విడుదల చేసిన ‘వాతావరణ మార్పు పనితీరు సూచిక-2026’లో వెల్లడైంది. ఈ సూచికలో భారత్ 13 స్థానాలు కిందికి దిగజారి 23వ స్థానం పొందింది. ఐరోపా యూనియన్‌తోపాటు 63 దేశాల పనితీరు ఆధారంగా ఈ ర్యాంక్‌లను ప్రకటించారు. ఆయా దేశాలు అనుసరించే గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలు, పునర్వినియోగ ఇంధనం, ఇంధన వినియోగం, వాతావరణ విధానం ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.
గత ఏడాది 10వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 23వ స్థానానికి దిగజారింది. బొగ్గు ఉత్పత్తిని తగ్గించడంలో భారత్‌కు తీవ్రమైన అడ్డంకులున్నాయని, రాత్రికి రాత్రి ఈ సమస్య పరిష్కారం కాదని ఢిల్లీ సైన్స్ ఫోరం వ్యవస్థాపక సభ్యుడు డీ రఘునందన్ పేర్కొన్నారు. పలు కారణాల వల్ల భారత్ బొగ్గుపై అధికంగా ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా డెన్మార్క్ మళ్లీ మొదటి స్థానాన్ని పొందింది.