కీవ్: రష్యా డ్రోన్ దాడి(Drone Attack)లో 9 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఉక్రెయిన్‌కు చెందిన మిని బస్సుపై ఈ అటాక్ జరిగింది. రష్యా బోర్డర్‌కు సమీపంలో ఉన్న బిలోపిలియా అనే పట్టణం వద్ద బస్సుపై దాడి చేశారు. ఈ ప్రమాదంలో ఏడు మంది గాయపడ్డారు. మరోవైపు దాదాపు మూడేళ్ల తర్వాత రష్యా, ఉక్రెయిన్ దేశాలు నేరుగా శాంతి చర్చిల్లో పాల్గొంటున్నాయి. యుద్ధ ఖైదీల అప్పగింతపై ఆ భేటీలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
కావాలనే సాధారణ ప్రజల్ని చంపుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యాకు చెందిన లాన్సెట్ డ్రోన్.. బస్సుపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణ ద్వారా వెల్లడైంది. ఈ దాడి అమానవీయమని ఆయన అన్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వెయ్యి మంది ఖైదీలను అప్పగించుకోనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా తమ మధ్య కాల్పుల విరమణ జరగవచ్చు అన్నారు. ఈ ఆఫర్‌ను ఉక్రెయిన్ ఎప్పటి నుంచో ప్రకటిస్తోందన్నారు.