న్యూయార్క్: ఇరాన్ వద్ద శుద్దీకరించిన యురేనియం(Enriched Uranium) నిల్వలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ యురేనియంను సక్రమ పద్ధతిలో ధ్వంసం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన తన ట్రుత్ సోషల్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిపారు. శుద్దీకరించిన యురేనియం( న్యూక్లియర్ డస్ట్)ను అమెరికాకు తీసుకువచ్చి దాన్ని ధ్వంసం చేస్తామని లేదంటే ఇరాన్ సహకారంతో ఆ దేశంలో కానీ లేదా మరో ప్రదేశంలో ధ్వంసం చేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ లేదా ఆ స్థాయికి తగ్గ సంస్థ సాక్షిగా .. యురేనియం నిల్వలను నిర్వీర్యం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.
ఇరాన్ తన యురేనియం ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేసుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ టెహ్రాన్ మాత్రం యురేనియం శుద్దీకరణను కొనసాగించనున్నట్లు చెబుతూనే ఉన్నది. అణ్వాస్త్రాలను అభివృద్ధి చేయడం లేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. కానీ అమెరికా మాత్రం యురేనియం అంశంలో పట్టుబట్టి ఉంది. అయితే ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియంను నిర్వీర్యం చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారి ఒకరు సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న కాల్పుల విరమణ డీల్‌ను మరో 60 రోజులు పొడిగిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థల ద్వారా తెలిసింది. ఖాతార్లోని దోహలో జరగనున్న సమావేశంలో.. ఇరాన్ యురేనియం గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 60 రోజుల్లో యురేనియం అంశంపై తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లు అక్సియోస్, అల్ అరేబియా మీడియా పేర్కొన్నది.