న్యూఢిల్లీ : కూతురిపై తండ్రి ప్రేమకు హద్దులుండవని అంటారు. ఆ మాటను నిజం చేస్తూ ఓ తండ్రి 20 ఏండ్ల పాటు ప్రతిరోజూ తన కూతురి ఫోటోలు క్లిక్‌మనిపించి టైమ్‌లాప్స్ వీడియో ప్రజెంట్ చేశాడు. ఈ వీడియోను రూపొందించిన డచ్ డైరెక్టర్ ఫ్రాన్ హఫ్మిస్టర్ సోషల్ మీడియాలో హాట్ డిబేట్‌గా మారిపోయారు. 20 ఏండ్లుగా ఆయన తన కూతురు లాటె ఫోటోలు తీసి భద్రపరిచాడు.
తన కూతురు సూపర్ క్యూట్ బేబీగా ఉన్నప్పటి నుంచి 20 ఏండ్ల యువతిగా మారే ప్రక్రియ అంతటినీ ఫోటోల్లో నిక్షిప్తం చేశాడు. లాటె బేబీ నుంచి అందమైన యువతిలా మారే క్రమంలో ఆమె అప్పియరెన్స్ ఎలా మారిందనేందుకు అద్దం పట్టేలా రెండు నిమిషాల 18 సెకండ్ల వ్యవధి కలిగిన వీడియోను రూపొందించాడు.
ఆమె జుట్టు రంగు నుంచి ఆహార్యం, దుస్తులు ఎలా మారిపోయాయని వెల్లడిస్తూ ఈ వీడియో అద్భుతంగా ప్రతి దశలో ఆయా దృశ్యాలను ఆవిష్కరించింది. 20 ఏండ్ల వయసు వచ్చే వరకూ కూతురి ఫోటోలు తీసిన తండ్రి ఈ వీడియోను క్రియేట్ చేశారని అంటూ రెడిట్‌లో షేర్ చేసిన ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. కూతురి పట్ల తండ్రికి ఉన్న మమకారం, అంకితభావాన్ని ఈ వీడియో తెలియచేస్తోందని ఓ యూజర్ కామెంట్ చేయగా, కూతురికి తండ్రి ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇదని మరో యూజర్ రాసుకొచ్చారు.