2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా ప్రశంసలు అందుకున్న తెలంగాణ, నేడు ఆదాయ వృద్ధిలో ఆందోళనకరమైన మందగమనాన్ని చవిచూస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదిన్నరేండ్ల కొనసాగిన బలమైన ఆర్థిక విస్తరణ తర్వాత, 2023-24 అనంతర కాలంలో రాష్ట్ర ఆదాయ వృద్ధి తిరోగమిస్తున్నది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో అస్థిరమైన బడ్జెట్ నిర్వహణ ప్రధానమైనది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాల్సిన భారీ ప్రాజెక్టులు పూర్తి కాలేదు, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఆర్థిక వృద్ధిలో మందగమనం కేవలం అంకెల్లో కనిపించే తగ్గుదల మాత్రమే కాదు, పెట్టుబడికి- దాని ఫలితానికి మధ్య, ఖర్చుకు-ఉత్పాదకతకు మధ్య ఏర్పడిన లోతైన అగాధాన్ని ప్రతిబింబిస్తున్నది.
ఆర్థిక వృద్ధి దశ2014-23
2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2023 వరకు తెలంగాణ ఆర్థిక ప్రస్థానం ఆశావహ వాతావరణంలో వేగవంతమైన విస్తరణతో ముందుకు సాగింది. రాష్ట్ర ఆదాయం ఏటేటా రెండంకెల స్థాయిలో పెరిగింది. 2021లో ఇది గరిష్ఠంగా 27.6 శాతానికి చేరుకున్నది. సాగునీరు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టులు గేమ్ చేంజర్లుగా నిలిచాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడం, వ్యవసాయాన్ని స్థిరీకరించడం, గ్రామీణ సౌభాగ్యానికి ఆసరాగా నిలువడం ప్రభుత్వ లక్ష్యాలుగా ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్ వంటి పారిశ్రామిక కార్యక్రమాలు తెలంగాణను తయారీరంగ కేంద్రంగా నిలబెడుతాయనే విశ్వాసం సర్వత్రా నెలకొన్నది. 2022-23 నాటికి రాష్ట్రం రూ.5,994 కోట్ల రెవెన్యూ మిగులును నమోదు చేసింది. రాష్ట్ర రుణం-జీఎస్డీపీ నిష్పత్తి కూడా నిర్వహించదగిన స్థాయిలోనే ఉన్నది. ఆర్థికంగా రాష్ట్రంలో ఆశావహ వాతావరణం స్పష్టంగా కనిపించింది.

Kcr
ఆర్థిక వ్యవస్థ మలుపు తిరిగిన దశ: 2023-24
పూర్తి కాని ప్రాజెక్టుల భారం
తెలంగాణ సాగునీటి రంగంలో భారీ ఖర్చు చేయడం, అదే సమయంలో ప్రాజెక్టులు పూర్తిలో నిర్లక్ష్యం చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. 2023 మార్చి నాటికే అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 20 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సి ఉండింది. వీటి మొత్తం అంచనా వ్యయం రూ.1.02 లక్షల కోట్ల నుంచి రూ.2.06 లక్షల కోట్లకు పెరిగింది. వీటిపై ఇప్పటికే రూ.1.73 లక్షల కోట్లు ఖర్చు అయింది. వీటిలో దాదాపు అన్నీ తుదిదశలోనే ఉన్నాయి. ఈ నిర్లక్ష్య ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. పెరిగిన వ్యయాలు రుణసేవల ప్రాధాన్యతను పెంచాయి. ప్రయోజనాలు ఆలస్యం కావడంతో సాగునీటి విస్తీర్ణం, వ్యవసాయ ఉత్పత్తి పెరుగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. మొత్తంగా సాగునీటి రంగం భారీ పెట్టుబడులను వినియోగించుకున్నది.
కానీ పెట్టుబడిపై రాబడులు రావాల్సిన చివరి దశలో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. పూర్తికాని మూలధన నిర్మాణం ద్వారా ఆర్థిక వనరులు వృథా కావడానికి ఇదొక స్పష్టమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఒకవేళ 2023 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి ఉంటే, దాదాపు రూ.30,000-40,000 కోట్ల అదనపు ఆర్థిక వ్యయంతో చాలా ప్రధానమైన ప్రాజెక్టులు 2027-28 నాటికి పూర్తయ్యేవి. ప్రాజెక్టులు పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు సాగునీటి సామర్థ్యం అందుబాటులోకి వచ్చేది. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, జీఎస్టీ ఆదాయ పెరుగుదల మునుపటి క్రమంలో ఉండేది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభించేది. 2023 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే, 2027-28 నాటికి తెలంగాణ ఆర్థిక పరిస్థితిలో కీలక మలుపు కనిపించేది. ఆర్థిక వృద్ధికి సాగునీరు ప్రధాన కారణంగా నిలిచేది. కానీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యం ఆర్థికంగా నష్టాలను కలిగించింది.
పారిశ్రామిక మౌలిక వసతులు నిరుపయోగం
రెండున్నరేండ్లుగా పారిశ్రామికరంగ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నది. హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్తోపాటు టీఎస్ఐఐసీ పరిధిలోని అనేక పారిశ్రామిక పార్కుల నిర్మాణంలోనూ జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. భూ ముల కేటాయింపులు జరిగినప్పటికీ, చాలా కంపెనీల యూనిట్లు ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదు. నిధుల మళ్లింపు, మార్కెట్ విలువ కంటే తక్కువ ధరలకు రాయితీతో భూముల కేటాయింపులు జరిగినట్టు వివిధ దర్యాప్తుల్లో బయటపడింది. భూమి కేటాయింపు జరిగిన 1,642 యూనిట్లలో కొద్దిపాటి యూనిట్లు మాత్రమే ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇలాంటి జాప్యం కారణంగా ఎదురైన పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూనిట్లలో కార్యకలాపాలు జరుగపోవడంతో ఆస్తి పన్ను లేదా రిజిస్ట్రేషన్ ఆదాయం రావడంలేదు. తయారీ రంగంలో ఉత్పత్తి లేకపోవడంతో జీఎస్టీ ద్వారా కూడా ఆదాయం లభించడంలేదు. ఉద్యోగాలు పెరిగితే వినియోగం పెరిగి పరోక్ష పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కానీ ఉద్యోగాల కల్పనలోనూ ప్రతికూల వాతావరణం నెలకొన్నది. దీంతో పన్నుల ఆదాయం పెరుగలేదు. ఆదాయాన్ని సమకూర్చాల్సిన పారిశ్రామిక మౌలిక వసతులు, చివరకు ఆర్థిక భారంగా మారాయి.
ఆర్థిక వ్యవస్థలో గొలుసు ప్రభావం
పారిశ్రామిక రంగంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, పడిపోతున్న ఆదాయం మధ్య సంబంధం కేవలం కాగితాలపై చెప్పే సిద్ధాంతపరమైనది కాదు. దాన్ని లెక్కల ద్వారా కూడా అంచనా వేయవచ్చు. నిలిచిపోయిన ప్రతి ప్రాజెక్టూ, రావాల్సిన ఆదాయ మార్గాలను అడ్డుకున్నది. రుణ బాధ్యతలు పెరుగుతున్న సమయంలో, దాని సమిష్టి ప్రభావం పన్నుల పునాది కుదించుకుపోవడంగా మారింది. తెలంగాణకు రాకుండాపోయిన ఆదాయం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. సాధారణంగా మౌలిక వసతులపై పెట్టుబడులు పెడితే సత్ఫలితాలు వస్తాయి.
ప్రతిరూపాయి కూడా అనేక రెట్ల ఆదాయాన్ని సమకూర్చుతుంది. కానీ 2023-24 తర్వాత తెలంగాణ ఎదుర్కొన్న అనుభవం ఇందుకు విరుద్ధంగా, ప్రతికూల ప్రభావాన్ని చూస్తున్నది. ఆర్థిక వ్యవస్థ మందగమనం అనేది వివిధ దశల్లో జరుగుతుంది. ప్రాజెక్టులు నిలిచిపోయినప్పుడు కాంట్రాక్టులకు చెల్లింపులు ఆగిపోతాయి. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత తగ్గుతుంది. ప్రాజెక్టులకు అనుబంధ పరిశ్రమలైన సిమెంట్, ఉక్కు, రవాణా రంగాలు డిమాండ్‌ను కోల్పోతాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. మొత్తంగా జీఎస్టీ ఆదాయం తగ్గుతుంది. ఇక ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి, ఖర్చుల కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ అప్పులకు వడ్డీ చెల్లింపులు కూడా పెరుగుతాయి. దీంతో రాష్ట్ర ఆదాయం ఉత్పాదకత పెంచే పెట్టుబడులపై పెట్టడానికి బదులుగా రుణాల చెల్లింపులకే సరిపోతుంది. తెలంగాణలో రెండున్నరేండ్లుగా సరిగ్గా ఇదే జరిగింది.
రాజకీయ ఆర్థిక వ్యవస్థ కోణం
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మందగమనం వెనుక పరిపాలనా ప్రాధాన్యతలు కూడా ప్రధాన కారణం. ఉదాహరణకు గతంలో మూలధన నిర్మాణంపై ఉన్న దృష్టి, ఇప్పుడు స్వల్పకాలిక సంక్షేమ వ్యయం, రుణాల ఆధారిత ప్రజాకర్షక విధానాల వైపు మళ్లింది. సంక్షేమం అవసరమే అయినప్పటికీ, బలమైన ఆదాయ పునాదిపై దాని స్థిరత్వం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయ పునాదే ఒత్తిడికి గురవుతున్నది. 2023లో జరిగిన అధికార మార్పు కేవలం ప్రభుత్వం మారినట్టుగా కనిపించడంలేదు. అది ఆర్థిక విధానాల కొనసాగింపులో విరామాన్ని సూచిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సమతుల్యమైన బడ్జెట్ నిర్వహణ వ్యవస్థను, సమర్థమైన ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా పొందింది. కానీ పాలనలో వైఫల్యాలతో ఆ సమర్థవంతమైన ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చింది. ఆదాయ ప్రవాహం తగ్గిపోయి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేది ఎలా?
ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరమున్నది. అందులో ముఖ్యమైనది.. ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం. అత్యంత ప్రభావం కలిగించే 5-6 ప్రాజెక్టులను గుర్తించాలి. కాళేశ్వరంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలి. ఫార్మాసిటీ, నిమ్జ్ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకురావాలి. వీటి కోసం ప్రభుత్వం నిధులను కేటాయించాలి. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలుపర్చి, నిర్మాణంలో ప్రాజెక్టులను పూర్తి చేసేవరకు కొత్త పథకాల పేరిట ఆర్భాటపు ప్రకటనలను నిలిపివేయాలి. అధిక వడ్డీ రుణాలను పునర్వ్యవస్థీకరించాలి. రుణాలను ఉత్పాదక మూలధన వ్యయంతో అనుసంధానించాలి. పారదర్శక రుణ వివరాల ప్రకటనను, ఆర్థిక బాధ్యతలపై ఆడిట్లను ప్రవేశపెట్టాలి.
ఆదాయ సమీకరణపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం జీఎస్టీ అమలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవస్థలను బలోపేతం చేయాలి. వినియోగంలో లేని పారిశ్రామిక భూములను పారదర్శకంగా వేలం ద్వారా విక్రయించి, ఆదాయ వనరులను సమకూర్చుకోవాలి. నిలిచిపోయిన మౌలిక వసతుల ప్రాజెక్టులకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాలను ప్రోత్సహించాలి. ప్రాజెక్టుల ఫలితాలను ప్రతి త్రైమాసికంలోనూ పర్యవేక్షించేలా ఆర్థికశాఖకు మరింత అధికారాన్ని ఇవ్వాలి. వివిధ శాఖల బడ్జెట్లను లెక్కించేందుకు వీలుగా, వివిధ సూచీలతో అనుసంధానించాలి. క్రమం తప్పకుండా ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయో తెలిపేవిధంగా నివేదికలను ప్రచురించాలి. ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు, పనుల పురోగతి, ఆశించిన రాబడిని వివరించాలి. పర్యవేక్షణ కోసం స్వతంత్ర ఆడిటర్లను, సిటిజన్ ప్యానెళ్లను భాగస్వాములను చేయాలి. ఈ చర్యల ద్వారా పెట్టుబడికి, ఆదాయానికి మధ్య, ఆర్థిక ప్రయత్నానికి, ఆర్థిక ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని క్రమంగా పునరుద్ధరించవచ్చు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి, పూర్తి చేసి ఉంటే, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ర్టానికి రూ.40,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరేది. ఇక అభివృద్ధి అంటే కేవలం నిధులు ఖర్చు చేయడం కాదు. ప్రాజెక్టులను పూర్తిచేసి, వాటిని వినియోగంలోకి తీసుకురావడం కూడా. సగం నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టు ఆస్తి కాదు, అది ఒక బాధ్యత. పెట్టుబడి పెట్టిన నిధులను ఉత్పాదక మూలధనంగా మార్చగల సామర్థ్యంపై ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సాగునీటి కాలువల్లో అప్పుల భారం కాకుండా నీరు ప్రవహించాలి. పారిశ్రామిక పార్కుల్లో పిచ్చిమొక్కలు కాకుండా పరిశ్రమలు పెరుగాలి. ఆర్థిక ప్రాధాన్యతలను తిరిగి సర్దుబాటు చేసుకుని, వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల పనులను పూర్తి చేయగలిగితే, 2024-26 మధ్య కాలంలో ఏర్పడిన అంతరాయం ఇప్పుడు పునరుద్ధరణకు మలుపుగా మారవచ్చు.
ఆర్థిక వృద్ధి దశ: 27.6% (2021)
రెవెన్యూ మిగులు రూ.5,994 కోట్లు(2022-23)
రాష్ట్ర ఆదాయ వృద్ధి 6.1% (2023-24)
రాష్ట్ర ఆదాయ వృద్ధి-0.76% (2024-25)
రెవెన్యూ లోటు రూ.8,782 కోట్లు (2024-25)
రెవెన్యూ లోటు రూ.10,000 కోట్లు (2025-26)
జనుంపల్లి జనార్దన్‌రెడ్డి