లండన్ : మానసిక ఆరోగ్యం కుదుటపడేందుకు ఏదో ఒక హాబీ అలవరచుకోవాలని వైద్యులు సూచించగా బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన అరోన్ ఫీనిక్స్ అరుదైన హాబీని చేపట్టారు. థెరఫిస్టు సూచనతో హాబీని ఎంపిక చేసుకోవాలనుకున్న అరోన్ అందరిలా కొత్త గేమ్‌ను నేర్చుకోవడమో, నూతన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంపైనో అరోన్ దృష్టిసారించలేదు. 2021 వేసవి నుంచి సాలీడులను సేకరించడం అరోన్ పనిగా పెట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి అరోన్ వద్ద 120 సాలీడులు చేరాయి.
ఆపై ఏడు నెలల్లో వాటి సంఖ్యను రెట్టింపు చేశాడు. ప్రతి ఒక్కరికీ ఓ ప్యాషన్ ఉంటుందని, తనకు సాలీడుల సేకరణ ప్యాషన్‌గా మారిందని అరోన్ చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా తనను స్పైడర్-మ్యాన్‌గా గుర్తిస్తున్నారని, వారు ప్రతివారం నాకోసం బాక్స్‌లో లైవ్ యానిమల్స్‌ను తీసుకొస్తారని చెప్పారు. వాటిని చూస్తూ తాను గంటల కొద్దీ సమయం గడుపుతానని సాలీడుల సేకరణను ఎప్పటికీ విడిచిపెట్టనని స్పష్టం చేశారు. సాలీడులు తన మానిసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేశాయని అన్నారు.
తాను ఇప్పటికీ కుంగుబాటుకు లోనైనా తన పరిస్దితిని ఇవి ఎలా మెరుగుపరిచాయనేది గుర్తుచేసుకుంటానని అన్నారు. సాలీడుల కోసం ఆరోన్ ప్రత్యేకంగా హ్యాపీ ప్లేస్ పేరుతో ఓ బెడ్రూం ఏర్పాటు చేశారు. మీరేమని పిలిచినా సాలీడుల సేకరణ, పెంపకం తనకు నచ్చిన వ్యాపకమని, తొలుత తన భార్య జో (45), కూతుళ్లు డెనాన్ (18), లిల్లీ (14)లు తన హాబీ పట్ల అసంతృప్తికి లోనైనా తన మానసిక ఆరోగ్యంపై కనిపించిన సానుకూల ప్రభావంతో వారంతా తనకు సహకరిస్తున్నారని చెప్పారు. ఏదో ఒక రోజు తాను సొంతంగా పెట్ షాపును తెరుస్తానని తెలిపారు.