ఇస్లామాబాద్, ఏప్రిల్ 9: పాకిస్థాన్‌లో శనివారం రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు చివరి దాకా ప్రయత్నించిన ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చివరకు అరెస్టుకు భయపడి దిగివచ్చారు. జాతీయ అసెంబ్లీలో అర్ధరాత్రి పొద్దుపోయాక తీర్మానంపై ఓటింగ్ జరిగింది. బలాబలాలనుబట్టి ప్రతిపక్షాల తీర్మానం నెగ్గడం దాదాపు ఖాయమే. దీంతో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఇన్సింగ్కు మధ్యలోనే తెరపడినట్టే. అంతకు ముందు, అవిశ్వాస తీర్మానంపై హైడ్రామా నడిచింది. అటు తీర్మానంపై పూర్తిస్థాయిలో చర్చ జరగకపోవడంతో పాటు ఇటు అవిశ్వాసంపై ఓటింగ్ జరగకుండా సభ వాయిదా పర్వంలో నడిచింది. ఓటింగ్‌కు ముందు అనూహ్యరీతిలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్ష పీఎంఎల్-ఎన్ నేత అయాజ్ సాధిక్ స్పీకర్‌గా వ్యవహరించి ఓటింగ్ చేపట్టారు.
వాయిదాల పర్వం
పాక్ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు పార్లమెంట్ శనివారం సమావేశమైంది. సభ ప్రారంభం నుంచే అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలు కొనసాగాయి. తీర్మానంపై నేరుగా ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్ మాత్రం ఇమ్రాన్ ఆరోపించిన ‘విదేశీ కుట్ర’పై చర్చించేందుకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళలతో సభ రాత్రి వరకు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో ఇమ్రాన్‌ఖాన్ అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహించారు. రాజీనామా చేయకూడదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇమ్రాన్, స్పీకర్లను అరెస్టు చేయించండి!
తీర్మానంపై ఓటింగ్ విషయంలో ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనను సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకొని ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రతిపక్ష నేత మరియమ్ నవాజ్ షరీఫ్ కోరారు. మరోవైపు తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన ఆదేశాలపై ఇమ్రాన్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఉత్తర్వులను సమీక్షించాలని కోరింది.