జెరూసలెం : గాజాపై ఇజ్రాయెల్ రక్షణ బలగాల (IDF) వైమానిక దాడుల్లో హమాస్ వెస్ట్రన్ ఖాన్ యూనిస్ బెటాలియన్ కమాండర్ మదత్ ముబ్షర్ను హతమార్చామని ఐడీఎఫ్ వెల్లడించింది. గురువారం వరుసగా రెండోరోజూ గాజా లక్ష్యంగా వైమానిక దాడులతో ఐడీఎఫ్ విరుచుకుపడింది. హమాస్‌ను తుదముట్టించే దిశగా ఐడీఎఫ్ వేగంగా పురోగమిస్తోంది. ఇక అంతకుముందు రోజు గాజా స్ట్రిప్‌లో 250 హమాస్ టార్గెట్లను ఐడీఎఫ్ ధ్వంసం చేసింది. ఐడీఎఫ్ బలగాలు, ఇజ్రాయిలీ సెటిల్మెంట్స్ లక్ష్యంగా గతంలో ముబ్షర్ పలు దాడులు, విస్ఫోటనాలకు పాల్పడ్డాడని సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరి వెల్లడించారు.
పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ జెనిన్ విభాగం ఫీల్డ్ కమాండర్ ఐసర్ మహ్మద్ అల్ అమర్‌ను కూడా అంతమొందించామని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. మరోవైపు పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్ (Israel-Hamas War) సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. అయితే గ్రౌండ్ ఆపరేషన్ ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలను ఆయన స్పష్టం చేయలేదు. నెతన్యాహు ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయల్ దళాలు ప్రవేశించడంపై ప్రభుత్వ ప్రత్యేక వార్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
తాము గాజాపై భూతల దాడులకు ఏర్పాట్లు చేస్తున్నామని, అయితే గ్రౌండ్ ఆపరేషన్ ఎలా, ఎప్పుడు చేపడతామనే వివరాలు తానిప్పుడు వెల్లడించలేనని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వేలాది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు.కాగా, ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా సాయుధ మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర పోరు ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇరు పక్షాల మధ్య యుద్ధం బుధవారం 18వరోజుకు చేరింది.
Read More :