టోక్యో: లెబనాన్‌లో వాకీటాకీలు(Walkie Talkies) పేలిన ఘనటలో 20 మంది మృతి చెందగా, మరో 450 మంది గాయపడ్డారు. హిజ్బుల్లా సాయుధ దళాలు వాడిన ఆ వాకీటాకీలు బుధవారం దేశవ్యాప్తంగా పేలాయి. ఆ వాకీటాకీలపై జపాన్‌కు చెందిన ఐకామ్ కంపెనీ లోగోలు ఉన్నాయి. దీనిపై ఆ కంపెనీ స్పష్టమైన ప్రకటన చేసింది. వాకీటాకీలను ఉత్పత్తి చేయడం దశాబ్ధం క్రితమే నిలిపివేసినట్లు ఐకామ్ రేడియో కంపెనీ వెల్లడించింది. పేలుళ్లు జరిగిన ప్రాంతాల నుంచి సేకరించిన ఫోటోలు, వీడియోలు ఆధారంగా .. ఆ వాకీటాకీలు ఐసీ-వీ82 ట్రాన్సిస్టర్లుగా గుర్తించారు.
ఒసాకాకు చెందిన టెలికమ్యూనికేషన్ కంపెనీ ఐకామ్ వాటిని తయారు చేసింది. అయితే ఐసీ-వీ82 మోడళ్లను గడిచిప పదేళ్ల నుంచి ఉత్పత్తి చేయడం లేదని ఆ కంపెనీ చెప్పింది. ఇక ఆ మోడల్ బ్యాటరీలను కూడా తయారు చేయడం లేదని ఐకామ్ కంపెనీ వెల్లడించింది. సోమవారం రోజున లెబనాన్ దేశవ్యాప్తంగా పేజర్లు పేలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 12 మంది మరణించగా, రెండు వేల మంది గాయపడ్డారు. అయితే తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ఆ పేజర్లను ఉత్పత్తి చేసినట్లు తెలుస్తోంది.
ఐసీ-వీ82 రేడియోలను 2004 నుంచి 2014 వరకు ఉత్పత్తి చేశామని, కానీ పదేళ్ల క్రితం వాటి తయారీ నిలిపివేశామని,అప్పటి నుంచి షిప్పింగ్ చేయలేదని ఐకామ్ తెలిపింది.