మున్నార్: ఆర్యా ఆల్డ్రిన్… జైరా.. ఈ ఇద్దరి స్టోరీ ఓ సెన్షేషన్. వారి మధ్య రిలేషన్ ఇప్పుడో ట్రెండింగ్. రష్యా బాంబుల మోత నుంచి మెడికల్ విద్యార్థి ఆర్యా తన పెంపుడు కుక్కతో ఉక్రెయిన్ నుంచి కేరళకు వచ్చిన తీరు ఓ ఇంట్రెస్టింగ్ జర్నీ. వార్ జోన్ నుంచి ఎలా ఆ 20 ఏళ్ల అమ్మాయి తన అయిదు నెలల కుక్క పిల్లతో వేల కిలోమీటర్లు దాటి ఇంటికి ఎలా వచ్చిందో ఆసక్తిని రేపుతోంది. విద్యార్ధుల తరలింపు ప్రక్రియలో కుక్కపిల్ల జైరాను విడిచిపెట్టి రాలేనని తేల్చి చెప్పిన ఆర్యా ఆ తర్వాత ఎలా తన డేరింగ్ జర్నీ చేసిందో తెలుసుకుందాం. సైబీరియన్ హస్కీ కుక్కను తనతో పాటు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ ఉక్రెయిన్ నుంచి రొమేనియా బోర్డర్ దిశగా జైరాతో ఆర్యా వెళ్లిన తీరు ప్రపంచ మీడియాను ఆకర్షించింది. మనుషులకే ప్రమాదం ఉన్న సమయంలో కుక్క పిల్లను ఎలా విమానంలో తీసుకువస్తారని విమర్శలు వచ్చాయి. అయినా కానీ ఆర్యా తన పంతం వీడలేదు. కార్గో సెక్షన్లో రొమేనియా నుంచి ఢిల్లీ వరకు విమానంలో జైరా వచ్చినట్లు ఆమె చెప్పింది.
2020లో ఆర్యా ఉక్రెయిన్‌కు వెళ్లింది. విన్నిసియా నేషనల్ పిరోగోవ్ మెమోరియల్ మెడికల్ వర్సిటీలో ఆమె వైద్య వృత్తిని చదువుతోంది. అక్కడున్న కేరళ మిత్రులతో కలిసి లీవింగ్ స్టార్ట్ చేసింది. జంతువులంటే ఇష్టం ఉండే ఆర్యాకు ఓ ఫ్రెండ్ రెండు నెలల పప్పీని గిఫ్ట్‌గా ఇచ్చారు. దానికి జైరా అని ఆమె పేరు పెట్టింది. రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత జైరాను వదిలిపెట్టేది లేదని ఆర్యా మొండిపట్టు పట్టింది. పప్పీని వదిలి రావాలని ఫ్రెండ్స్ సలహా ఇచ్చిన దాన్ని ఆమె వదలలేదు. కానీ ఆర్యా తల్లి మాత్రం ఆమెకు సపోర్ట్ ఇచ్చింది. తండ్రి తొలుత వద్దన్నా.. ఆ తర్వాత అంగీకరించాడు.
పరిస్థితులు అనుకూలంగా లేకున్నా.. జైరాకు పెట్ పాస్‌పోర్ట్ తీసుకున్నది. ఒక్క రోజులోనే వ్యాక్సినేషన్ పేపర్స్, మైక్రోచిప్ తెచ్చుకున్నది. ఆర్యా, జైరాలు మరో ఫ్రెండ్‌తో కలిసి విన్నిసియా నుంచి ఫిబ్రవరి 26వ తేదీన ఉక్రెయిన్ నుంచి బయటకు బయలుదేరారు. రొమేనియా బోర్డర్‌కు బస్సులో వెళ్లారు. బాంబుల మోత మోగుతున్న ఆర్యా మాత్రం గట్టిగా జైరాను పట్టుకున్నది. వాహనాల క్యూ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్యా ప్రయాణించిన బస్సు బోర్డర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. జూస్, బిస్కెట్ల బ్యాగ్‌తో పాటు జైరా డాగ్ ఫుడ్‌తో బోర్డర్ దిశగా వాకింగ్ మొదలుపెట్టారు. షాపుల్లో ఎక్కడా వాళ్లకు నీళ్లు కానీ బ్రెడ్ కానీ దొరకలేదు. ఈ సమయంలోనే ఆర్యాకు నెలసరి సమస్యలు వచ్చాయి. వెన్నునొప్పి ఇబ్బంది పెడుతున్నా ఆమె తన పయనాన్ని ఆపలేదు. 16 కిలోల బరువున్న జైరాను తన భుజంపై వేసుకుని జర్నీ కొనసాగించింది. కొన్ని చోట్ల ఆగి రెస్ట్ తీసుకున్నది. ఓ దశలో బరువును తగ్గించుకునేందుకు ఫుడ్, జూస్‌ను తన బ్యాగ్ నుంచి తీసేసింది. దాదాపు 12 కిలోమీటర్ల దూరం వరకు జైరాను మోసుకెళ్లింది.
రొమేనియా బోర్డర్ వచ్చే వరకు ఆర్యా బ్యాగ్‌లో కేవలం డాగ్ ఫుడ్, ట్రావెల్ డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయి. ఇక ఆ బోర్డర్ వద్ద గందరగోళం ఉంది. వేలాది సంఖ్యలో తరలింపు ప్రక్రియ కోసం జనం వేచిచూస్తున్నారు. జనం ఒకర్ని ఒకరు తోసేస్తున్నారు. అంతా అయోమయం. కుక్కపిల్లను కొందరు తన్నుకుంటూ వెళ్లారు. డాక్యుమెంట్ చెకింగ్ సమయంలో జైరాను ఎత్తుకుని గంటన్నర సేపు ఒంటికాలుపై నిలుచున్నట్లు ఆర్యా చెప్పింది. అక్కడ రిస్క్ తీసుకున్న తీరు చూస్తే మళ్లీ విన్నిసియాకు వెళ్లాలనిపించినట్లు ఆమె తెలిపింది. బ్యాగ్ బరువెక్కడంతో ఓ దశలో డాగ్ ఫుడ్‌ను కూడా తీసివేసింది. ఎట్టకేలకు రొమేనియా బోర్డర్‌ను దాటేశారు. కుక్కపిల్లను ఎత్తుకున్న ఆర్యాను చూసి ఓ ఉక్రెయిన్ సైనికుడు ఆమె వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. బోర్డర్ క్రాసైనప్పుడు ఆ రిలీఫ్ చెప్పలేనిదన్నట్లు ఆర్యా పేర్కొన్నది.
రొమేనియాలోకి ప్రవేశించిన తర్వతా షెల్టర్ హోమ్‌కు వెళ్లారు. అక్కడ వాళ్లకు ఆహారం, నీరు దొరికింది. బూట్లు పాడవడంతో.. ఓ వాలంటీర్ ఆర్యాకు వాటిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. బుచారెస్ట్‌లో ఉన్న హెన్రీ కొండా విమానాశ్రయం చేరుకోవడానికి ముందు మరో చోట షెల్టర్ తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ సమయంలో జైరాకు వాళ్లు ఫుడ్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు ట్యాక్సీ ఇప్పించారు. ఇక చివరకు జైరాను కేజ్‌లో పెట్టాలని రొమేనియా అధికారులు ఆర్యాకు చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీ విమానాన్ని ఆర్యా, జైరాలు ఎక్కేశారు. విమానంలో ఇచ్చిన ఆహారాన్ని జైరా కోసం దాచినట్లు ఆర్యా చెప్పింది.
ఢిల్లీలో దిగిన తర్వాత ఎయిర్ ఏషియా విమానం కూడా జైరాను తీసుకువెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. మరో ఫ్లయిట్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. కొచ్చి విమానాశ్రయానికి ఆర్యా చేరుకున్న తర్వాత ఆమెకు గ్రాండ్‌గా వెల్కమ్ దక్కింది. జైరాకు వ్యాక్సిన్ ఇప్పించి.. హిల్ స్టేషన్లో ఉన్న మున్నార్‌కు దాన్ని తీసుకువెళ్లింది. వాస్తవానికి సైబీరియన్ హస్కీ కుక్కపిల్లకు బొచ్చు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉక్రెయిన్‌లో ఉండే శీతల వాతావరణం నుంచి అది కాపాడుతుంది. కానీ ఇండియాలో వెదర్ కొంచెం పొడిగా ఉంటుంది. అయితే మున్నార్ హిల్ స్టేషన్ కావడంతో జైరాకు సమస్యేమీ ఉండదని ఆర్యా చెబుతోంది. యుద్ధ దేశం నుంచి ప్రాణాలతో బయటకు వచ్చిన జైరా ఇప్పుడు ఆర్యాతో ఎక్కువగా గడపడం లేదట. తన తల్లితోనే జైరా ఎక్కువగా ఉంటోందని ఆర్యా నవ్వుకుంటూ చెప్పింది.