Kamala Harri | అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. నవంబర్ 5న ప్రధాన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris), రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బరిలోకి దిగారు. ఇరువురూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకూ వెలవడిన ఎన్నికల సర్వేల్లో కమలా హారిస్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఈ నేపథ్యంలో అమెరికాకు దాదాపు 14 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తులసేంద్రపురం (Thulasendrapuram) అనే మారుమూల గ్రామంలో యూఎస్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ గ్రామం తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలో ఉంది. ఇది హారిస్ పూర్వీకుల గ్రామం. అందుకే ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతు తెలుపుతూ గ్రామస్థులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. గ్రామ వీధులు, ప్రధాన కూడళ్ల వద్ద భారీగా కమలా హారిస్‌కు మద్దతుగా పోస్టర్లు పెట్టారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజా కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. అమెరికా ఎన్నికల వేళ.. ప్రస్తుతం ఈ గ్రామం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
Kamala Harris2
కమలా హారిస్ తల్లి పేరు శ్యామల. 19 ఏండ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. ఆ రోజుల్లో ఆ కుటుంబానికి అమెరికాలో తెలిసిన వాళ్లు కానీ, సాయం చేస్తామన్న వాళ్లూ కానీ ఎవరూ లేరు. న్యూఢిల్లీలోని లేడీ ఇర్విన్ కళాశాలలో హోమ్‌సైన్స్ చదువుతూ ఇంట్లో ఎవరికీ తెలియకుండా శ్యామల అమెరికాలో పై చదువుకు దరఖాస్తు చేసింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సీటు వచ్చింది. స్కాలర్షిప్ వచ్చింది. శ్యామల వాళ్ల నాన్న సెంట్రల్ సెక్రటేరియట్ ఉద్యోగి. తండ్రి అంగీకారంతో తమిళనాడు నుంచి అమెరికా బయలుదేరింది శ్యామల. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎండోక్రైనాలజీలో పీహెచ్డీ పట్టా సాధించింది. అక్కడే (బ్రిటిష్) జమైకా నుంచి అమెరికా వచ్చిన ఎకనామిక్స్ విద్యార్థి డొనాల్డ్ జె. హారిస్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు. ఆ తర్వాత వేర్వేరు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తూ ప్రయాణాలు చేశారు. ఈ దంపతులకు రెండో సంతానంగా కమలా హారిస్ పుట్టింది. అమెరికాలో పెరిగినా అమ్మమ్మ ఊరైన మద్రాస్‌తో హారిస్‌కు అనుబంధం ఉంది. చాలాసార్లు ఇక్కడికి వచ్చింది.
న్యాయం కోసం.. న్యాయం వైపు కమల చిన్నప్పటినుంచి చదువుల్లో చురుకు. హోవర్డ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, హాస్టింగ్ కాలేజ్ ఆఫ్ లా విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించింది. న్యాయశాస్త్ర విద్య పూర్తయ్యాక అలమెడా కౌంటీకి జిల్లా అటార్నీ అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత శాన్ఫ్రాన్సిస్కో నగర అటార్నీగా పదోన్నతి పొందింది. అమెరికా సుప్రీంకోర్టులోనూ ఉద్యోగిగా పనిచేసింది. కొన్నాళ్ల తర్వాత.. అటార్నీ జనరల్ ఆఫ్ కాలిఫోర్నియాగా ఎన్నికైంది.
2014లో మరోసారి అదే పదవికి ఎన్నికైంది. 2021లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయానికి అమెరికాలో నల్లజాతి ప్రజలు హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఆ సమయంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఉన్న కమల.. నల్లజాతి ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రజాస్వామికంగా, శాంతియుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆఫ్రో అమెరికన్లపై పోలీసుల అరాచకాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడంతో డెమోక్రటిక్ పార్టీ నల్లజాతి మహిళను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకుంది. దేశ పరిస్థితుల పట్ల డెమోక్రాట్ల అంచనా తప్పలేదు. కమలా హారిస్ గెలిచింది. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతోంది. అధ్యక్ష స్థానానికి పోటీపడ్డ తొలి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించింది. ఇక గెలిస్తే కమలా హారిస్ మరో చరిత్రే..!
Also Read..
Us Elections | అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి.. ఇప్పటికే ఓటేసిన 6 కోట్ల మంది
Donald Trump | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. ఖండించిన ట్రంప్
Cartridge | వరుస బెదిరింపుల వేళ.. విమానంలో క్యాట్రిడ్జ్ గుర్తింపు