Gaza Ceasefire | గాజా స్ట్రిప్, జనవరి 19: చిరకాలంగా ఎదురుచూస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలు ప్రారంభం కావడంతో గాజాలో శాంతి వీచికలు ప్రారంభమయ్యాయి. తమ వద్ద బందీలుగా ఉన్న రోమి గోనెన్ (24), ఎమిలీ దామరి (28), డోరోన్ స్టీన్‌బ్రెచర్ (31) లను హమాస్.. రెడ్ క్రాస్ ప్రతినిధుల ద్వారా ఇజ్రాయెల్ సైన్యానికి ఆదివారం అప్పగించగా, వారు ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. బందీల విడుదల దృశ్యాలను వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులు టీవీలలో లైవ్‌లో చూసి ఆనందం వ్యక్తం చేశారు. రానున్న ఆరు వారాల్లో మిగిలిన 33 మందిని కూడా విడుదల చేయనున్నట్టు హమాస్ ప్రకటించింది.
కాగా, ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా తొలి విడతగా తమ వద్ద ఉన్న 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. తర్వాత విడతల వారీగా మొత్తం 2,000 మందిని వదిలిపెడుతుంది. అంతకు ముందు 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమలును హమాస్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభించింది. ఒప్పందం అమలు కొన్ని గంటలు ఆలస్యం కావడంతో ఈలోగా ఖాన్‌యూనిస్ నగరం దక్షిణ భాగంపై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 26 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సాంకేతిక క్షేత్ర కారణాల వల్లే ఒప్పందం అమలు ఆలస్యమైనట్టు హమాస్ పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో ఆదివారం పౌరుల సంబరాలు మిన్నంటాయి. యుద్ధ భయంతో 15 నెలల క్రితం ఇళ్లు, ఆస్తులను వదిలి బతుకు జీవుడా అంటూ వెళ్లిపోయిన లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లకు తిరిగి రావడం ప్రారంభించారు. ఒక పక్క కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కాలేదు, మరో పక్క ఇజ్రాయెల్ తన వాయుసేన దాడులు కొనసాగిస్తూనే ఉంది, అయినా లక్ష్యపెట్టక వేలాది మంది పౌరులు కాలినడక, గాడిదలు లాగే బండ్లపై గాజాకు చేరుకోవడం కన్పించింది.
15 నెలల పాటు సాగిన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 46 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. వారిలో సగం మంది మహిళలు, పిల్లలే. 1.10 లక్షల మంది గాయపడ్డారు. 23 లక్షల మంది ఉన్న జనాభాలో 19 లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి భవనాలు, ఇళ్లు శిథిలాలుగా మారాయి. 69 శాతం ఆస్తులు ధ్వంసం అయినట్టు ఐక్యరాజ్య సమితి గత నెలలో అంచనా వేసింది. వీటిని పునరుద్ధరించడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. పేరుకుపోయిన శిథిలాలను తొలగించడానికే 15 ఏండ్లు పడుతుందని తెలిపారు. కాగా, 2014లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మరణించిన తమ సైనికుడు ఓరన్ సాహుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయెల్ ఒక ప్రకటనలో తెలిపింది.