జెనీవా, జూన్ 21: తమ ఇంట్లో వివిధ పనుల కోసం నియమించిన పనివారి శ్రమను దోపిడీ చేశారంటూ హిందూజా కుటుంబంపై వచ్చిన ఆరోపణలను న్యాయస్థానం నిర్ధారించింది. దీంతో భారత సంతతికి చెందిన సంపన్న హిందూజా కుటుంబంలోని నలుగురికి జెనివాలోని స్విస్ క్రిమినల్ కోర్టు శుక్రవారం నాలుగు నుంచి నాలుగున్నర ఏండ్ల జైలు శిక్షను విధించింది. అయితే వారు మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్టు నమోదైన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది.
భారత్‌లో జన్మించిన వ్యాపారవేత్త ప్రకాశ్ హిందూజా, అతని భార్య, కుమారుడు, కోడలు భారత్ నుంచి అక్రమంగా కొందరు పనివారిని రప్పించినట్టు అభియోగం. జెనివాలోని విల్లాల్లో వారిచేత రోజుకి 18 గంటలు పనిచేయించుకునే వారని, వారు ఎక్కడికీ వెళ్లకుండా పాస్‌పోర్టులు తమ వద్ద ఉంచుకునేవారని, స్విస్ చట్టాల ప్రకారం నిర్దేశించిన కనీస వేతనాల్లో 10వ వంతు కూడా వారికి చెల్లించే వారు కాదని ఆరోపణలున్నాయి.