Bangladesh Crisis | ఢాకా, ఆగస్టు 7: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామాతో నెలకొన్న హింసలో అనేక దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, హిందూ మైనారిటీలు, హసీనా మద్దతుదారులే లక్ష్యంగా అల్లరిమూకలు హింసకు తెగబడ్డాయి. ప్రముఖులను సైతం లక్ష్యంగా చేసుకున్నాయి. ధన్మొండిలోని ప్రముఖ బెంగాలీ గాయకుడు రాహుల్ ఆనంద ఇంటిని దుండగులు లూటీ చేసి, నిప్పు పెట్టారు. ‘జోలెర్ గాన్’ పేరుతో ఆయన ఈ ఇంటి నుంచి ఒక బ్యాండ్‌ను నడుపుతున్నారు.
అనేక పాటలను ఇక్కడి నుంచే ఆలపించేవారు. గత ఏడాది సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కూడా ఈ ఇంటిని సందర్శించారు. రాహుల్ ఆనంద ఇంట్లో ఉన్న దాదాపు 3 వేల సంగీత వాయిద్యాలను దుండగులు చోరీ, ధ్వంసం చేశారు. ఇప్పటివరకు రాహుల్ ఆనంద, ఆయన కుటుంబసభ్యుల ఆచూకీ లభించడం లేదు.
బంగ్లా యువ నటుడు శంతో ఖాన్, నిర్మాత అయిన ఆయన తండ్రి సెలిమ్ ఖాన్‌ను కూడా అల్లరిమూకలు హతమార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ జీవితంలోని పలు సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఓ సినిమాను సెలిమ్ తెరకెక్కించగా, శంతో ఖాన్ నటించారు.
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసపై కాబోయే ప్రభుత్వాధినేత ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ స్పందించారు. ‘ఈ పరిస్థితుల్లో అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నా. ఎలాంటి హింస, విధ్వంస చర్యలకు పాల్పడొద్దు. మనం సాధించిన ఈ విజయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం చేసే తప్పుల వల్ల ఈ విజయాన్ని కోల్పోవద్దు. అర్థంలేని హింసతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. హింసనే మన శత్రువు. దయచేసి ఎక్కువ శత్రువులను సృష్టించవద్దు.’ అని ఆయన పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు బంగ్లాదేశ్ సైనికాధ్యక్షుడు ఉజ్జమాన్ ప్రకటించారు.
బంగ్లాదేశ్‌లో సంక్షోభం మన దేశానికి చెందిన ఉల్లి రైతులకు శాపంగా మారింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి బంగ్లాదేశ్ ఉల్లిగడ్డలతో వెళ్లిన 80 ట్రక్కులను పశ్చిమ బెంగాల్లో బంగ్లా సరిహద్దు వద్ద నిలిపివేశారు. బంగ్లాకు ఎగుమతయ్యే ఉల్లిగడ్డల్లో దాదాపు 80% మహారాష్ట్రలోని నాసిక్ నుంచే వెళ్తాయి.
సరిహద్దులకు భారీగా బంగ్లాదేశీయులు బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో ఆశ్రయం కల్పించాలని కోరుతూ భారత సరిహద్దులకు భారీ సంఖ్యలో బంగ్లాదేశీయులు చేరుకుంటున్నారు. బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లాలో సరిహద్దులకు వందలాది మంది చేరుకున్నారు. వీరిని బీఎస్ఎఫ్ అడ్డుకున్నది.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పాలన ముగియడంతో ఇప్పుడు అందరి ఆసక్తి ఐనాఘర్పైన నెలకొంది. హసీనా హయాంలో ఐనాఘర్ను రహస్య జైలుగా ఉపయోగించారనే ప్రచారం ఉంది. హసీనాను వ్యతిరేకించిన వారిని, రాజకీయ ప్రత్యర్థులను బంగ్లాదేశ్ సైనిక ఇంటెలిజెన్స్ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్(డీజీఎఫ్ఐ) అనధికారికంగా అరెస్టు చేసి ఐనాఘర్లో బంధించేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా నిర్భందించిన వారిలో చాలామంది సమాచారం కుటుంబసభ్యులకు కూడా తెలిసేది కాదట. వీరిని కోర్టుల్లో కూడా హాజరుపరిచే వారు కాదని, కొందరు ఐనాఘర్లోనే మరణించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.