సిమ్లా, మార్చి 22 : గ్యారెంటీలంటూ అలివికాని హామీలు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ర్టాన్ని దివాలా తీయిస్తున్నది. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలోకి రాష్ర్టాన్ని నెట్టేసింది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల జీతాల్లో కోత విధించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెడుతూ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ స్వయంగా ఈ విషయం వెల్లడించారు. కోత విధించిన మొత్తాన్ని ఆరు నెలల్లో తిరిగి చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రం రుణ ఉచ్చులో చిక్కుకుందని, తీసుకున్న అప్పులపై వడ్డీకి ఏటా చెల్లించాల్సిన 1,300 కోట్లను సమీకరించడం చాలా కష్టంగా ఉందని ఆయన అన్నారు. తనతో సహా మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ఉద్యోగుల జీతాల్లో కొంత మేర కోత విధించి వాటి చెల్లింపును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా తన జీతంలో 50 శాతం, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రుల జీతాల్లో 30 శాతం, ఎమ్మెల్యేల జీతాల్లో 20 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపారు. దానిని రాబోయే ఆరు నెలల పాటు వాయిదా వేయనున్నట్టు తెలిపారు.
వివిధ రాజకీయ నియామకాల కింద నియమితులైన చైర్మన్లు, ఉప చైర్మన్లు, సలహాదారులకు, ఉన్నత అధికారులకు కూడా జీతాల్లో కోత విధిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. చీఫ్ సెక్రటరీ, అదనపు చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, డీజీపీ, ఏడీజీపీ, ఎస్ఎస్పీ, వారి సమాన స్థాయి ర్యాంకు అధికారులకు కూడా దీని కింద జీతాల్లో కోత తప్పదు. అయితే గ్రూప్ సీ, గ్రూప్ డీ కేడర్ ఉద్యోగులకు ఈ కోత వర్తించదని, వారికి పూర్తి జీతం వస్తుందని సీఎం తెలిపారు. కాగా, కేంద్రం రెవెన్యూ లోటు గ్రాంటు (ఆర్డీజీ)ను నిలిపివేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అదనపు ఒత్తిడిని పెంచింది. సాధారణంగా రాష్ర్టాల ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైనప్పుడు లోటు ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన లోటును పూడ్చడానికి కేంద్రం ఇచ్చేదే రెవెన్యూ లోటు గ్రాంట్. అయితే ఈసారి కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌కు ఆర్డీజీ ఇవ్వకపోవడంతో సుఖూ సర్కార్ మరింత ఆర్థిక కష్టాల్లో పడింది.
ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ను తగ్గించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ రాష్ట్ర బడ్జెట్ పరిమాణంలో ఇలా గణనీయమైన కోత విధించ లేదు. అలాగే మధ్య తరతగతి ప్రజలపై ఇలాంటి జీతాల కోతలు విధించడం కూడా రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా, తన చర్యలను ఆర్థిక శాఖ కూడా నిర్వహిస్తున్న సుఖూ సమర్థించుకున్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, దీనికి తోడు కేంద్రం ఆర్డీజీని ఉపసంహరించుకోవడం వల్ల ఏటా రాష్ర్టానికి రూ. 8,500 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని చెప్పారు. ఈ సవాల్‌ను ఎదుర్కోవడం కోసం తనతో పాటు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా ఉన్నతాధికారుల జీతాల్లో కోత విధించే నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని చూసి ఈ విషయంలో సీనియర్ స్థాయి అధికారుల జీతాల్లో 30 శాతం వాయిదాకు సంబంధించి హైకోర్టు కూడా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన సూచించారు. రూ.54,928 కోట్లకు కుదించిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి శనివారం ప్రవేశపెట్టారు. ఇది గత ఏడాది బడ్జెట్ 58,514 కోట్లతో పోలిస్తే 3,586 కోట్లు కోత. మునుపటి బడ్జెట్ కన్నా తక్కువ మొత్తంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. కేటాయించిన ప్రతి 100 రూపాయల్లో రూ. 27 జీతాలకు, రూ. 21 పెన్షన్లకు, రూ. 13 వడ్డీలకు, రూ. 9 అప్పు చెల్లింపులకు, చట్టబద్ధమైన సంస్థల నిధులకు రూ.10, పోగా, కేవలం రూ. 20 మాత్రమే మూల ధన పనులకు, ఇతర కార్యకలాపాలకు వెచ్చిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తిరోగమన బడ్జెట్‌గా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ పేర్కొన్నారు. గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే రూ.4,000 కోట్లు తక్కువని, అంటే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఆ మేరకు దిగజారాయని అన్నారు. దిశ, దశా లేకుండా పోవడం వల్లే రెవెన్యూ లోటు ఏర్పడుతున్నదని, దానిని పూడ్చడం లేదంటూ కేంద్రంపై ముఖ్యమంత్రి అర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. గత ఏడాది కన్నా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపు 4 వేల కోట్లు తగ్గడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నదని రాజ్యసభ ఎంపీ హర్హ్ మహాజన్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అభివృద్ధి పత్రం కాదని, ఆర్థిక దివాలా పత్రమని అన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, మంత్రుల జీతాలను 3 నుంచి 50 శాతం తగ్గించడం దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రబల నిదర్శనమని రాజ్యసభ ఎంపీ సికందర్ కుమార్ విమర్శించారు. రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.