అశ్వారావుపేట, మార్చి 22: రాష్ట్రంలోనే అత్యధిక ఆయిల్‌పామ్ దిగుబడి ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ పామాయిల్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు ఉమామహేశ్వర్‌రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య, రైతులు డిమాండ్ చేశారు. ఏడాదికి రూ.180 కోట్లకు పైగా ఆదాయం అందించే ఖమ్మం జిల్లాలో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఉన్న ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయం ఎదుట ఆయిల్‌పామ్ రైతులతో కలిసి ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్‌ఫెడ్ పరిధిలోని రెండు ఫ్యాక్టరీల్లో ఏడాదికి లక్షల టన్నుల గెలలు క్రషింగ్ అవుతున్నాయని, ఈ క్రూడాయిల్‌ను సిద్దిపేటకు తరలించడానికి రవాణా ఖర్చులే రూ.16 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా రూ.40 కోట్లతో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు చేయడం శ్రేయస్కరమని సూచించారు. అనంతరం కార్యాలయం ఉద్యోగి అశోక్‌కు వినతిపత్రం అందజేశారు.