కాఠ్మాండు: నేపాల్‌లోనే అతిపెద్ద హోటల్‌గా హిల్టన్ కాఠ్మాండు(Hilton Kathmandu)కు గుర్తింపు ఉన్నది. కానీ ఎవరెస్టు పర్వతం లాంటి ఆ హోటల్.. నిరసనకారుల ఆగ్రహ జ్వాలలకు బూడిదైంది. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో ఆ అద్దాల మేడ పూర్తిగా ధ్వంసమైంది. మంటల్లో చిక్కుకున్న ఆ హోటల్ వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. జెన్ జెడ్ ఉద్యమం తాకిడికి .. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు ఇండ్లు కూడా ధ్వంసం అయ్యాయి. ఇక నేపాల్‌కు కీర్తిగా నిలిచిన హిల్టన్ కాఠ్మాండు హోటల్ కూడా ఆ జ్వాలల్లో కాలిపోవడం శోచీనయంగా మారింది.
హోల్టన్ కాఠ్మాండును శంకేర్ గ్రూపు డెవలప్ చేసింది. 2016లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. నేపాల్ పర్యాటకులకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గ సేవలు అందించాలన్న ఉద్దేశంతో హిల్టన్ హోటల్‌ను నిర్మించారు. కోవిడ్ సమయంలో హోటల్ నిర్మాణం తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నది. సుమారు రూ.8 బిలియన్లు ఖర్చు చేసి ఏడేళ్ల పాటు దీన్ని నిర్మించారు. ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉన్న ఈ హోటల్‌ను 2024 జూలైలో ప్రారంభించారు. 64 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ఆకాశహర్మ్యం .. నేపాల్‌లోనే అతిపొడువైన హోటల్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. దీంట్లో 176 రూమ్‌లు, సూట్లు ఉన్నాయి.
Hilton Hotel यसरी जल्दैछ।
After genz protesters set fire to the Hilton Hotel #GenZ #Nepalprotest #noCorruptoion pic.twitter.com/oNzUoBVOOZ— Pratima Makhim (@pmakhim) September 9, 2025
హోటల్లో ఉన్న వర్టికల్ గ్లాసులను.. బుద్ద ప్రార్థన జెండాల రూపంలో డిజైన్ చేశారు. అయితే ఆ అద్దాల ప్యానల్స్ .. సూర్యుడి వెలుతురిలో ఓ రకంగా, రాత్రి వేళ మరో రకంగా కనిపిస్తాయి. స్థానిక పరిస్థితులకు తగినట్లు బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఉంది. ఓ వైపు కాఠ్మాండు అర్బన్ వీధులు కనిపిస్తాయి. మరో వైపు నుంచి లాంగ్టాంగ్ పర్వత శిఖరాలు దర్శనం ఇస్తుంటాయి. గెస్టులకు నేపాల్ సహజ అందాలు అందించే రీతిలో ఈ హోటల్‌ను నిర్మించారు.
ప్రపంచ స్థాయి హాస్పిటాలిటీ కల్పిస్తోంది హిల్టన్ హోటల్. లాబీ, బాంకెట్ హాల్స్, మీటింగ్ స్పేస్‌లను కింద ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు. ఇక పైన ఉన్న రూమ్‌లు అక్కడి లోయలు, పర్వతాలను ఎంజాయ్ చేసే రీతిలో ఉంటాయి. అయిదు రెస్టారెంట్లు, స్పా, జిమ్ కూడా ఉన్నాయి. రూఫ్‌టాప్‌లో ఓరియన్ బార్ ఉన్నది. స్విమ్మింగ్ పూల్, డైనింగ్ సౌకర్యాలు అప్పర్ లెవల్స్‌లో ఉన్నాయి. భూకంపాలను తట్టుకునే రీతిలో హిల్టన్ హోటల్‌ను నిర్మించారు. నేపాల్ ప్రగతికి సింబల్‌గా మారిన హిల్టన్ హోటల్.. తాజా నిరసనల్లో దగ్ధం కావడం ఆ దేశాన్ని కలిచివేసే అంశమే.