వాషింగ్టన్, అక్టోబర్ 11: అమెరికా అధ్యక్ష పదవి కోసం మరోమారు పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. గురువారం డెట్రాయిట్ ఎకనామిక్ క్లబ్లో ట్రంప్ ప్రసంగిస్తూ, అమెరికా ఉత్పత్తులపై భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తున్నదని, తాను మళ్లీ అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని చెప్పారు. అమెరికా దిగుమతులపై చైనా 200 శాతం వరకు సుంకాలు విధిస్తున్నదని, బ్రెజిల్లో పన్ను టారీఫ్‌లు కూడా అలాగే ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్షుడిగా గెలిస్తే, విద్యుత్ చార్జీలు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. 12 నెలల్లో ఇంధన, కరెంట్ బిల్లులు సగానికి తగ్గిస్తానని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, ఉచిత తాయిలాలు అమెరికా దాకా వెళ్లాయని అన్నారు. ట్రంప్ పోస్టును రీ ట్వీట్ చేశారు.