Hezbollah | జెరూసలేం, సెప్టెంబర్ 19: హెజ్బొల్లాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నది. గత ఏడాదికాలంగా గాజాలో హమాస్‌పై పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకున్నది. గాజాలో యుద్ధ తీవ్రత తగ్గడంతో ఇప్పుడు హెజ్బొల్లాకు కేంద్రమైన లెబనాన్ సరిహద్దుకు బలగాలను మోహరిస్తున్నది. గాజాలో జరిగిన పోరులో కీలకంగా వ్యవహరించిన వేలాది మంది సైనికులతో కూడిన 98వ డివిజన్‌ను లెబనాన్ వైపు పంపిస్తున్నది. రెండు రోజులుగా హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలు, ఇతర పరికరాలు పేలుతున్న ఘటనల వెనుక కూడా ఇజ్రాయెల్ ఉందని హెజ్బొల్లా ఆరోపిస్తున్నది. మరోవైపు ‘యుద్ధంలో కొత్త దశ మొదలైంది’ అంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యావ్ గాల్లంట్ ప్రకటించారు. హెజ్బొల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోనున్నదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
గత ఏడాది అక్టోబరు 8 నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నప్పటికీ ఇరుపక్షాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగలేదు. ఏడాదిగా ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో 500 మందికి పైగా మరణించారు. హెజ్బొల్లా దాడుల్లో 23 మంది ఇజ్రాయెల్ సైనికులు, 26 మంది ప్రజలు మరణించారు. కాగా, 2006లోనూ ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో హెజ్బొల్లా తీవ్రంగా నష్టపోయింది. అయితే, అప్పటి నుంచి హెజ్బొల్లా కూడా యుద్ధ సామర్థ్యాలను పెంచుకుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం హెజ్బొల్లా దగ్గర 1,50,000 రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని, ఇజ్రాయెల్ భూభాగంలో ఏ ప్రాంతంపైనైనా లక్షిత దాడులు చేసే సామర్థ్యమూ హెజ్బొల్లాకు ఉందని యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య యుద్ధం జరిగితే ఇరువైపులా నష్టం భారీగానే ఉండే అవకాశం ఉంది.
ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య నెలల తరబడి జరుగుతున్న యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అటు ఇజ్రాయెల్ కానీ, ఇటు హమాస్ కానీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా వేలాదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గాజాస్ట్రిప్ శవాల దిబ్బగా మారుతున్నది. అక్కడి ప్రజలు నిత్యం బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. యుద్ధాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా పరిస్థితులు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తనంత తానే ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. తమ వద్దనున్న బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తే గాజా స్ట్రిప్‌లో యుద్ధాన్ని విరమిస్తామంటూ హమాస్‌కు ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలందరినీ విడిచిపెట్టడంతోపాటు గాజా స్ట్రిప్ నుంచి తమ మిలటరీని వెనక్కి పిలిపిస్తామని, గాజాలో కొత్త పాలనా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది.