Indus Waters : పాకిస్తాన్‌కు సింధు నది నీళ్లు ఇవ్వకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌ను భారీ దెబ్బకొట్టింది. భారత సరిహద్దులోని పాక్ ప్రాంతాలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ను పాకిస్తాన్ బ్రతిమిలాడాల్సింది పోయి.. బెదిరింపులకు దిగుతోంది. సింధు నదీజలాలు ఇవ్వకుంటే భారత్ అంతుచూస్తామంటూ హెచ్చరిస్తోంది. తాజాగా, పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ కూడా భారత్‌ను బెదిరించాడు. సింధు నదీ జలాలు పాకిస్తాన్ నీళ్లు అంటూ చెప్పాడు. అంతేకాదు.. తమ నీళ్లను ఎవరైనా వాడుకుంటే వారి చేతులు నరికేస్తామంటూ పరోక్షంగా భారత్‌ను హెచ్చరించాడు.
పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరార్ మాట్లాడుతూ సింధు నదీ జలాలను ఒక ట్యాప్ ద్వారా మన ప్రధానమంత్రి కంట్రోల్ చేస్తున్నారు అంటూ విమర్శించాడు. పాకిస్తాన్లోకి ఒక్క చుక్క నీళ్లు కూడా రాకుండా అడ్డుకుంటున్నారన్నాడు. ఇలా ఏకపక్షంగా ఒక దేశం నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం తగదంటూ చెప్పుకొచ్చాడు. సింధు నదికి సంబంధించిన జలాల విషయంలో ఇండియా, పాక్ మధ్య దశాబ్దాలుగా ఒప్పందం ఉంది. అయితే, గత ఏడాది పహల్గాంలో ఉగ్రదాడుల తర్వాత ఈ ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల పంపిణీని భారత్ నిలిపివేసింది. మిగులు జలాల్ని కూడా ఇండియానే వాడుకుంటోంది. దీనిపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నా, అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ ఉన్నా భారత్ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం గురించి గత ఏడాది మోదీ మాట్లాడారు. తీవ్రవాదం, చర్చలు రెండూ ఒకేసారి ఉండవు అంటూ చెప్పారు. అలాగే, రక్తం, నీరు కలిసి పారలేవు అంటూ పేర్కొన్నారు.
ఈ విషయంలో ఇండియా తన వైఖరి మార్చుకోబోదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇటీవల స్పష్టం చేశారు. భారత నిర్ణయం వల్ల పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతోంది. అక్కడి సుక్కుర్ బ్యారేజ్ దాదాపుగా ఎండిపోయింది. ఈ బ్యారేజ్ పాకిస్తాన్‌లోని సింధు నదిపై ఉంది. ఈ నదికి నీళ్లు ఇండియా నుంచే వెళ్తాయి. కానీ, ఇండియా నీళ్లను ఆపేయడంతో అక్కడ నది ఎండిపోయి కనిపిస్తోంది. ఈ నది నుంచి బలూచిస్తాన్‌లోని లక్షలాది వ్యవసాయ భూములకు నీరు అందేది. ఇప్పుడు ఆ భూములన్నీ బీడుబారుతున్నాయి. పాకిస్తాన్ సింధు నది నుంచి ఏర్పడ్డ కాలువల్లో కూడా నీటి ప్రవాహం తగ్గిపోయింది.