రఫా,అక్టోబర్ 24 : గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో 704 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. వీరిలో 305 మంది చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు బాంబు దాడులు, విద్యుత్తు కొరతతో గాజా వ్యాప్తంగా చాలా వరకు దవాఖానలు మూతపడుతున్నాయి. దీంతో రోగులు, బాంబు దాడుల క్షతగాత్రులకు వైద్యం అందడం కష్టతరంగా మారింది. హమాస్ కమాండర్లు, తీవ్రవాదులే లక్ష్యంగా గత 24 గంటల్లో 400 వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్‌కు మద్దతు తెలుపుతూ ఆ దేశ ప్రధాని నెతన్యాహూతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మంగళవారం భేటీ అయ్యారు. కాగా, గాజాపై చేస్తున్న దాడులు ఇజ్రాయెల్‌కే బెడిసి కొట్టే అవకాశం ఉన్నదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. గాజాపై ఆంక్షలు పాలస్తీనియన్లలో ఆగ్రహాన్ని పెంచడమే కాకుండా ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతునూ బలహీనపరుస్తాయని చెప్పారు. ప్రాణ నష్టాన్ని పట్టించుకోని ఇజ్రాయెల్ సైనిక వ్యూహాలు.. ఎదురుతగిలే ప్రమాదం ఉందన్నారు. హమాస్ చెరలో 222 మంది బందీలుగా ఉన్నట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. హమాస్ సోమవారం ఇద్దరు ఇజ్రాయెల్ వృద్ధురాళ్లను విడిచిపెట్టింది. హమాస్ మిలిటెంట్లు, వారి చెరలో బందీలుగా ఉన్న ఆచూకీ చెప్పాలని గాజా వాసులకు ఇజ్రాయెల్ సైన్యం ఆఫర్ ఇచ్చింది. వివరాలు గోప్యతంగా ఉంచుతామని, రక్షణ కల్పిస్తామని, ప్రైజ్ మనీ కూడా ఇస్తామని మంగళవారం పేర్కొన్నది.