H-1B VISA | వాషింగ్టన్, డిసెంబర్ 26: విదేశీ నిపుణులు అమెరికా ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. ఈ వీసాలపై ఇప్పటివరకు ఉన్న కంట్రీ క్యాప్‌ను తొలగించే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలు కఠినతరం అవుతాయని, అమెరికా వీసాలు దక్కడం మరింత కష్టమవుతుందనే అంచనాలకు భిన్నంగా ఈ నిర్ణయం ఉండే అవకాశం ఉంది.
ఏదైనా రంగంలో నిపుణులైన ఇతర దేశాల వారు అమెరికాలోని కంపెనీల్లో ఆరేండ్ల పాటు పని చేసుకునేందుకు వీలుగా హెచ్1బీ వీసాలు ఇస్తారు. అయితే, ఈ వీసాలపై పరిమితి ఉంది. మొత్తం వీసాల్లో 7 శాతానికి మించి ఏ దేశానికి ఇవ్వొద్దని అమెరికా గతంలో ‘కంట్రీ క్యాప్’ విధించింది. దీంతో హెచ్1బీ వీసాలకు ఎక్కువగా పోటీ పడే దేశాల వారు ఏండ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. జనాభా, పోటీ తక్కువగా ఉండే దేశాల వారికి ఎలాంటి వెయిటింగ్ లేకుండా వేగంగా ఈ వీసాలు వస్తున్నాయి. ఇప్పుడు కంట్రీ క్యాప్ తొలగిస్తే.. దేశంతో సంబంధం లేకుండా హెచ్1బీ వీసాలు జారీ అవుతాయి. పోటీ ఎక్కువగా ఉన్న దేశస్థులకు ఎక్కువ హెచ్1బీ వీసాలు దక్కుతాయి.
హెచ్1బీ వీసాలపై పరిమితి తొలగిస్తే భారతీయ నిపుణులకు ఎక్కువ మేలు జరగనుంది. టెక్నాలజీ, ఐటీ, ఇంజినీరింగ్, ఆరోగ్య రంగాల నిపుణులకు అమెరికా ఎక్కువగా ఈ వీసాలు ఇస్తుంది. టెక్, ఐటీ, ఇంజినీరింగ్ నిపుణుల సంఖ్య భారత్‌లో ఎక్కువ.
హెచ్1బీ వీసాలపై కంట్రీ క్యాప్‌ను తొలగించాలనే ప్రతిపాదనను భారత అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్ తెరపైకి తెచ్చారని తెలుస్తున్నదిట్రంప్ గెలిచాక ఆయనను కీలకమైన సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యాలయంలో ఏఐ పాలసీ సలహాదారుగా నియమించారు. ఇమిగ్రేషన్ విధానంలో ప్రతిభకు పెద్దపీట వేయాలని, ప్రతిభ ఆధారంగా వీసాల కేటాయింపు ఉండాలని ఆయన సూచించారు.