వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో దీనిపై వైట్‌హౌస్ స్పష్టతనిచ్చింది. తాము విధించిన 1 లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, అది కూడా కేవలం కొత్త దరఖాస్తుదారుల నుంచే దానిని వసూలు చేస్తామని స్పష్టం చేసింది. శుక్రవారం దీనిపై ప్రకటన చేసిన అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఈ పెంచిన ఫీజును ప్రతి ఏడాది చెల్లించాలని, కొత్త వీసాదారులతో పాటు వీసా రెన్యువల్స్‌కు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆదివారం ఈ పాలసీ అమలులోకి రావడానికి కొద్ది గంటల ముందు దీనిపై శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వివరణ ఇచ్చారు. ‘ఇది వార్షిక ఫీజు కాదు. ఇది ఒక్కసారి మాత్రమే అమలవుతుంది. అది కూడా కొత్త వీసాదారులకు మాత్రమే. రెన్యువల్ చేసుకునే వారికి, ప్రస్తుత వీసాదారులకు వర్తించదు’ అని ఆమె ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే హెచ్-1బీ వీసా కలిగి ఉండి విదేశాల్లో ఉన్న వారు తిరిగి అమెరికాలో అడుగుపెట్టడానికి వారిపై లక్ష డాలర్ల రుసుం విధించరని ఆమె తెలిపారు. యథావిధిగానే వారు అమెరికా నుంచి వారి వారి దేశాలకు వెళ్లవచ్చు, తిరిగి రావచ్చునని ఆమె భరోసా ఇచ్చారు. కాగా, హెచ్-1బీ వీసాపై ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమెరికా కాలమానం ప్రకారం 21వ తేదీ మొదలయ్యాక అర్ధరాత్రి 12.01 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులను అమెరికా కంపెనీలు కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
హెచ్-1బీ వీసాలపై శ్వేత సౌధం వివరణ రాకముందు ఎట్టి పరిస్థితుల్లో దేశాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్లవద్దని, అలాగే విదేశాల్లో ఉన్న వారు వెంటనే ఆదివారం డెడ్‌లైన్ లోగా యూఎస్‌కు తిరిగి రావాలని యూఎస్ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఈ ప్రకటన హెచ్-1బీ వీసాదారుల్లో తీవ్ర ఆందోళన, గందరగోళం సృష్టించింది. దీంతో శుక్రవారం అమెరికా నుంచి ఇతర దేశాలకు బయలుదేరిన ఉద్యోగులు ఈ ప్రకటన వెలువడిన వెంటనే విమానాలు దిగిపోగా, ఇతర దేశాల్లో ఉన్న కొందరు వెంటనే ఆదివారం విధించిన డెడ్‌లైన్‌లోగా చేరుకోవడానికి అమెరికాకు తిరిగి బయలుదేరారు. కాగా, నిపుణులైన టెక్ కార్మికులను నియమించుకునేందుకు యూఎస్ కంపెనీల కోసం ప్రభుత్వం హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంది. ఈ వీసా ద్వారా సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజినీర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, విద్యావేత్తలు, డాటా సైంటిస్టులు, ఇతర నిపుణులు వస్తుంటారు. ఈ వీసా కాలపరిమితి మూడేండ్లు. తర్వాత దానికి ఆరేండ్లకు పొడిగిస్తారు. అమెరికా ప్రతి ఏడాది జారీ చేసే హెచ్-1బీ వీసాలలో 70 శాతం భారతీయులే పొందుతారు. రెండో స్థానంలో చైనా దేశీయులు న్నారు. 2024లో అమెరికా నాలుగు లక్షల హెచ్-1బీ వీసాలు మంజూరు చేయగా, అందులో మూడింట రెండు వంతులు రెన్యువల్ చేసినవే. కొత్త హెచ్-1బీ దరఖాస్తులపై వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడాన్ని శ్వేత సౌధం సమర్థించుకుంది. అమెరికన్లకు బదులుగా తక్కువ వేతనానికి పని చేసే విదేశీ కార్మికులను తీసుకొస్తున్నారని తెలిపింది. హెచ్-1బీ వీసాలపై వచ్చే ఉద్యోగుల్లో ఐటీ వర్కర్ల వాటా ఇటీవలి సంవత్సరాల్లో 65 శాతానికి పైగా పెరిగిందని పేర్కొంది. నిరుద్యోగం కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో 6.1 శాతానికి చేరిందని పేర్కొంది. అమెరికాలో విదేశీ స్టెమ్ (ఎస్టీఈఎం) వర్కర్ల సంఖ్య 2000 నుంచి 2019 మధ్య కాలంలో రెట్టింపునకుపైగా పెరిగిందని తెలిపింది.
కొన్ని కంపెనీలు హెచ్-1బీ వర్కర్లను నియమించుకుని, వేలాది మంది అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్నాయని పేర్కొంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఓ కంపెనీ 5,189 హెచ్-1బీ వర్కర్లకు ఆమోదం పొంది, దాదాపు 16,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని వివరించింది. ఒరెగావ్లోని కంపెనీ 1,698 హెచ్-1బీ వర్కర్లకు ఆమోదం పొంది, జూలైలో 2,400 మంది అమెరికన్లను తొలగిస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొంది. మూడో కంపెనీ 2022 నుంచి 25,075 హెచ్-1బీ అప్రూవల్స్ పొంది, 27,000 మంది అమెరికన్లను తొలగించిందని తెలిపింది. అమెరికన్ వర్కర్లకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీసా రుసుమును ట్రంప్ పెంచారని పేర్కొంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం అమెరికన్ల ఉద్యోగాలను అమెరికన్లకు ఇవ్వడమే లక్ష్యమని వివరించింది. అమెరికన్ వర్కర్లకు పెద్ద పీట వేయడం కోసమే ప్రెసిడెంట్ ట్రంప్‌నకు ఓటర్లు భారీ తీర్పును ఇచ్చారని శ్వేత సౌధం శ్వేతపత్రం తెలిపింది. మాన్యుఫ్యాక్చరింగ్ జాబ్స్‌ను తిరిగి అమెరికాకు తీసుకురావడం కోసం, అమెరికాకు కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసం ట్రంప్ దూకుడుగా, విజయవంతంగా కొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని పేర్కొన్నది.