H-1B Visa | న్యూయార్క్, ఫిబ్రవరి 5: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారికి మరో చేదు వార్త. ఇప్పటికే వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. గత బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్ వీసాలు హెచ్-1బీ, ఎల్-1 ఆటో రెన్యువల్‌ను రద్దు చేసే దిశగా ట్రంప్ సర్కారు యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వర్క్ వీసాలు ఆటోమేటిక్‌గా 180 రోజుల నుంచి 540 రోజులకు రెన్యువల్ అయ్యేలా తీసుకొచ్చిన నిర్ణయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీకి ప్రతిబంధకంగా మారుతుందని ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది.
అక్రమ వలసదారులను గుర్తించడం కష్టం
కాంగ్రెసెనల్ రివ్యూ చట్టం ప్రకారం.. బైడెన్ సర్కారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సెనేటర్లు జాన్ కెన్నెడీ, రిక్ స్కాట్ జనవరి 31న తీర్మానం ప్రవేశపెట్టినట్టు సమాచారం. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ పాలసీకి ఇది అడ్డంకిగా మారుతుందని, ప్రమాదంలో పడేస్తుందని కెన్నెడీ వాదించినట్టు తెలుస్తున్నది. ‘బైడెన్ సర్కారు తీసుకొచ్చిన రూల్ వల్ల వలసదారులకు ఆటోమేటిక్‌గా 540 రోజుల వర్క్ పర్మిట్ పొడిగింపు లభిస్తుంది. ఇది ఇమ్మిగ్రేషన్ చట్టాలకు ఆటంకంగా మారుతుంది.
దేశం, అమెరికన్ల భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది’ అని కెన్నెడీ పేర్కొన్నట్టు తెలుస్తున్నది. మరో సెనేటర్ స్కాట్ కూడా బైడెన్ నిర్ణయాన్ని ఖండించారు. బైడెన్-కమలా హ్యారిస్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రభుత్వం అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీని నిర్వీర్యం చేయాలని చూసిందని ఆయన ఆరోపించారు. ‘ఏండ్లకేండ్లు అనుమతి లేకుండా అక్రమ వలసదారులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించడం అసంబద్ధమైనది. ఇది సరిహద్దు రక్షణను తుంగలో తొక్కుతుంది. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతుంది’ అని స్కాట్ వాదించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుండా అక్రమ వలసదారులను గుర్తించడం కష్టతరమవుతుందని వారు పేర్కొన్నట్టు సమాచారం.
భారతీయులపైనే ఎక్కువ ప్రభావం
వర్క్ వీసాల అనుమతుల పొడిగింపులో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఈ రూల్‌ను 2024 డిసెంబర్లో ప్రతిపాదించింది. ఈ ఏడాది జనవరి 13న అమల్లోకి తీసుకొచ్చిన దీని ద్వారా భారతీయులతో సహా వివిధ దేశాలకు చెందిన వలసదారులు, శరణార్థులు, గ్రీన్‌కార్డు హోల్డర్లు, హెచ్-1బీ, ఎల్-1 వీసాదారుల కుటుంబసభ్యులు లబ్ధి పొందారు. ప్రధానంగా అత్యధిక సంఖ్యలో భారతీయులకు లబ్ధి జరిగింది.
హెచ్-1బీ వీసాల్లో అత్యధికంగా 3.86 లక్షలు భారతీయులకు దక్కడమే అందుకు తార్కాణం. ఇది 72.3 శాతం. 2022లో ఈ సంఖ్య 77 శాతం కావడం విశేషం. అంతేకాదు, 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 49,700 మంది భారతీయులు అమెరికా సిటిజన్‌షిప్, గ్రీన్‌కార్డులు పొందారు. 2022 మే 4న తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి బైడెన్ సర్కారు తీసుకొచ్చిన రూల్ వర్తిస్తుంది. కాగా, డీహెచ్ఎస్ సెక్రెటరీ అలెజాండ్రో ఎన్ మయోర్కస్ ఈ పాలసీని సమర్థించారు. ‘2021 జనవరి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ సుమారు 16 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించింది. ఆ ఉద్యోగాలను భర్తీ చేసి వ్యాపారాలకు దోహదం చేయాలని డీహెచ్ఎస్ భావించింది’ అని మయోర్కస్ తెలిపారు.