Pannun Case | వాషింగ్టన్: అమెరికాలో నిరుడు ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా అమెరికన్ జాతీయుడైన సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ హత్యకు కుట్ర జరిగినట్టు చెప్తున్న అగ్రరాజ్యం.. ఆ కుట్రలో భారత విదేశీ నిఘా సంస్థ ‘రా’ (రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) అధికారి వికాస్ యాదవ్ (39) ప్రమేయం ఉన్నట్టు తాజాగా ఆరోపించింది. ఈ మేరకు గురువారం న్యూయార్క్‌లోని కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ‘రా’ను నడిపే క్యాబినెట్ సెక్రటేరియట్లో వికాస్ యాదవ్ ఉద్యోగిగా పనిచేశారని, ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియడం లేదని అమెరికన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆ చార్జిషీట్లో పేర్కొన్నారు. హత్యకు ప్రణాళిక రచించడం, ఆ ప్రణాళిక అమలుకు వ్యక్తులను నియమించడంతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడేందుకు కుట్ర పన్నినట్టు వికాస్ యాదవ్‌పై అభియోగాలు మోపారు. కాగా, అగ్రరాజ్యం ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది.